ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపీఆర్సీ విషయంలో ఉద్యోగులకు అపోహలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన కమిటీతో ఇంత వరకూ పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చలకు రాలేదు. జీవోలను ఉపసంహరించడం, పాత జీతాలే ఇవ్వాలన్న డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఒక్క పీఆర్సీ సాధన సమితీ నేతలు మాత్రమే కాదని ఎవరు వచ్చినా చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం వైపు నుంచి పీఆర్సీ సాధన సమితీ నేతలకు మాత్రమే చర్చలకు రావాలని ఆహ్వానం పంపుతున్నారు. రోజూ చర్చల కోసం రావడం.. మధ్యాహ్నం వరకూ వెయిట్ చేసి వెళ్లడం కామన్‌ అయిపోయింది. 


ఉద్యోగ నేతలు చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం వ్యూహం మార్చింది. పీఆర్సీ సాధన సమితీ పేరుతో ఏర్పాటయిన సంఘాలే కాకుండా ఎవరు వచ్చినా చర్చలు జరుపుతామని.. పీఆర్సీపై సందేహాలు ఉంటే తీరుస్తామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో వారి పిలుపునకు స్పందించిన ఏపీ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఫోరం నేతలు తాము చర్చలకు వస్తామని సమాచారం పంపారు. దీంతో వారితో చర్చలు జరపాలని ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా నిర్ణయించింది. ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు కూడా కమిటీతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది.  ప్రభుత్వం మరికొన్ని ఉద్యోగ సంఘాలకు కూడా ఆహ్వానం పంపుతోంది.  సహజంగా ఉద్యోగుల్లో  గ్రూపులు ఉంటాయి. ఎవరి ఉద్యోగ సంఘం వారికి ఉంటుంది. ఇలాంటి వారిలో చర్చలకు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి...  పీఆర్సీ గురించి వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ కమిటీ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 


ఉద్యోగ సంఘాలను చీల్చే ప్రయత్నం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన తర్వాత పీఆర్సీ సాధన సమితీ నేతలు విమర్శలు గుప్పించారు.  ఎవరు వచ్చినా చర్చలు జరుపుతామంటున్నారని.. జరుపుకోవచ్చని.. ఉద్యోగులంతా సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.  తమ ఐక్యతను దెబ్బతీయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుమానిస్తున్నారు. ఎవరెన్ని చేసినా తాము వెనక్కి తగ్గబోమని అంటున్నారు. 


ప్రభుత్వంతో చర్చలకు వస్తామని చెప్పిన ఏపీ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఫోరంకు గుర్తింపు లేదు. ఆ పేరు కూడా పెద్దగా ఎప్పుడూప్రచారంలోకి రాలేదు. ఆ ఉద్యోగ సంఘంలో ఎంత మంది సభ్యులు ఉన్నారో కూడా ఉద్యోగులకే తెలియదు. అయితే ప్రభుత్వమే వ్యూహాత్మకంగా ఈ సంఘాన్ని తెరపైకి తెచ్చి ఉద్యోగులతో చర్చలు జరిపామన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తోందని పీఆర్సీ సాధన సమితి అనుమానిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వంతో అనురించాల్సిన వ్యూహంపైనా సమాలోచనలు చేస్తున్నారు.