Hyper Adi Comments in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో టీవీ నటుడు హైపర్ ఆది సందడి చేశారు. ఆయన పవన్ కల్యాణ్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. జనసేన స్టార్ క్యాంపెయినర్లలో హైపర్ ఆది కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా హైపర్ ఆది ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో ఎన్నికలు ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఆది మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ కు పిఠాపురంలో లక్షకుపైగా మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా బాగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 


ఆయనతోపాటు నేడు హైపర్ ఆది కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పవన్‌ కల్యాణ్‌కే తమ ఓటు అని అందరూ చెబుతున్నారని హైపర్ ఆది చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ నిధుల కోసం ఏనాడూ వేచి చూడలేదని.. తన పార్టీని తానే ముందుండి నడిపించారని సొంత సొమ్ము ఖర్చు పెట్టారని హైపర్ ఆది గుర్తు చేశారు. సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఓ రేంజ్ లో తయారవుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా పిఠాపురం గురించే మాట్లాడుకుంటారని.. హైదరాబాద్‌ను సందర్శించేందుకు విదేశాల నుంచి ఎలాగైతే వస్తున్నారో పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే పిఠాపురం చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారని అన్నారు. 


ఇక తాను ప్రస్తుతం తాను టీవీ, సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం లేదని హైపర్ ఆది చెప్పారు. ఈ నెల రోజులు తాను పవన్ కల్యాణ్ కోసమే ఎన్నికల ప్రచారం చేస్తానని ఆది చెప్పారు. ఎన్నికలు పూర్తయిన తర్వాతే షూటింగ్ లలో పాల్గొంటానని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు పిఠాపురం సహా జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గా్ల్లో పోటీ చేస్తామని చెప్పారు.


టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. మరో 2 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించారు. అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను జనసేన పార్టీ ఇటీవల ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్‌ అంబటి రాయుడు, కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌, సినీ నటుడు సాగర్‌ (మొగలిరేకులు ఫేమ్), పృథ్వీ (30 ఇయర్స్ ఇండస్ట్రీ), హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను తదితరులను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది.