Hardik Pandya stepbrother Vaibhav Pandya  Arrest: హార్దిక్ పాండ్యా(Hardik Pandya), కృణాల్ పాండ్యాల  సోద‌రుడు వైభ‌వ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.  ఫోర్జ‌రీ ద్వారా అత‌డు దాదాపు రూ.4.3 కోట్ల నిధుల‌ను దారి మ‌ళ్లించిన‌ట్లు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అత‌డిని అరెస్ట్ చేసిన‌ట్లు సమాచారం. 


కేసు వివరాల్లోకి వెళితే 2021లో హార్దిక్‌, కృణాల్‌, వైభ‌వ్‌లు క‌లిసి ఓ వ్యాపారం మొద‌లుపెట్టారు. ఈ బిజినెస్ ను హార్దిక్, కృనాల్‌లు చెరో 40 శాతం వైభ‌వ్ 20 శాతం పెట్టుబడితో మొద‌లుపెట్టారు. ఇందులో పెట్టిన పెట్టుబ‌డి ప్ర‌కారం వ్యాపారంలో వ‌చ్చిన లాభాల‌ను పంచుకోవాలని మొదట నిర్ణయం తీసుకున్నారు.  అంటే హార్దిక్‌, కృణాల్ పాండ్యాలకు 40 శాతం ప్రాఫిట్ వెళ్తుంది. ఇక వైభ‌వ్‌కు 20 శాతం మాత్ర‌మే ద‌క్కుతుంది.అయితే.. వైభ‌వ్ త‌న సోద‌రులు ఇద్ద‌రికి తెలియ‌కుండా రూ.4.3 కోట్ల నిధుల‌ను దారి మ‌ళ్లించాడు. ఈ నిధుల‌తో అత‌డు మ‌రో సంస్థ‌ను నెల‌కొల్పాడు. ఇది హార్దిక్, కృనాల్ పాండ్యాలకు  ఆర్థిక నష్టాన్ని కలిగించింది. అలాగే దీనికోసం  హార్దిక్‌, కృనాల్ సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేసిన‌ట్లుగా వైభ‌వ్ పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో అత‌డిపై చీటింగ్‌, ఫోర్జ‌రీ కేసులు న‌మోదు అయ్యాయి. హార్దిక్, కృణాల్‌  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైభ‌వ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. 


 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కూడా వరుసగా విఫలమవుతున్నా గత మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఐపీఎల్‌లో తొలి విజయం నమోదు చేసింది. బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడగా కేవలం ఒకే విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ముంబై తర్వాతి స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది. దాదాపుగా ముంబై కూడా అదే స్థితిలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. బెంగళూరుతో పోలిస్తే ముంబయి బ్యాటింగ్‌కు ఢోకా లేదు. ముంబయిలో  రోహిత్, ఇషాన్‌కిషన్‌ మంచి ఓపెనింగ్ అందిస్తుండగా.. తిలక్‌వర్మ, టిమ్‌ డేవిడ్ దానిని కొనసాగించేందుకు తీవ్రంగానే  ప్రయత్నిస్తున్నారు. ముంబయి తుది జట్టులో ఒక మార్పు జరిగింది . స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా స్థానంలో మరో స్పిన్నర్‌ శ్రేయస్ గోపాల్‌ను తీసుకున్నారు. అలాగే బెంగళూరు తరఫున బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వీల్ జాక్స్‌ అరంగేట్రం చేస్తున్నాడు. 


ముంబయి తుది జట్టు :  హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్‌), తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, గెరాల్డ్ కొయెట్జీ, ఆకాశ్‌ మధ్వాల్.


బెంగళూరు తుది జట్టు:  డుప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, వీల్ జాక్స్‌, రజత్ పటిదార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), మహిపాల్ లామ్రోర్, రీస్ టాప్లీ, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌.