Police Denies Permission for Pawan Kalyan Special Flight: 
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పరామర్శించేందుకు విజయవాడ వెళ్లాలనుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవం ఎదురైంది. డీజీసీఏ నుంచి అనుమతి తీసుకున్నా సైతం పవన్ కళ్యాణ్ ను బేగంపేట విమానాశ్రయంలో అడ్డుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో పవన్ గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లాలని భావించారు. కానీ ఏపీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు పవన్ విమానానికి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని కృష్ణా జిల్లా పోలీసులు తెలపడంతో బేగంపేట విమానాశ్రయం నుంచి ఫ్లైట్ టేకాఫ్ కాలేదు. పోలీసుల రిక్వెస్ట్ తో ఎయిర్ పోర్ట్ అధికారులు పవన్ ప్రత్యేక విమానం గన్నవరం వెళ్లడానికి టేకాఫ్ చేయనీయలేదు. దాంతో పవన్ నిరాశగా వెనుదిరిగారు. 


మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన పార్టీ పీఏసీ  సభ్యులు, ముఖ్య నాయకుల ఆదివారం సమావేశం కానున్నారు. శనివారమే విజయవాడకు వెళ్లాలని జనసేనాని పవన్ భావించారు. కానీ కృష్ణా జిల్లా పోలీసుల రిక్వెస్ట్ తో బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే పవన్ ను పోలీసులు ముందుకు వెళ్లనివ్వలేదు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ పోలీసులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.






విజయవాడలో అప్రమత్తమైన పోలీసులు.. 
పవన్ కళ్యాణ్ ఏ క్షణంలోనైనా ఏపీకి వస్తారని విజయవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఏపీ పోలీసుల రిక్వెస్ట్ తో బేగంపేట ఎయిర్ పోర్టులో పవన్ ప్రత్యేక విమానానికి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్ పోర్టు అధికారులను పోలీసులు కోరారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. కేవలం కుటుంబ సభ్యులనే అనుమతిస్తామని వెల్లడించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‍కు అనుమతి ఇస్తామన్నారు పోలీసులు. ఆదివారం పార్టీ మీటింగ్ ఉందని పవన్ విజయవాడకు వెళ్తున్నారని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా జనసేనాని రాకను అడ్డుకున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ అంటే ఎందుకింత భయం?
పవన్ కళ్యాన్ అంటే వైసీపీకి ఎందుకిత భయం అని, పార్టీ కార్యక్రమాలకి ఆయన వెళ్లకుండా అడ్డుకోవడమేనా ప్రజాస్వామ్యం అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టకుండా కృష్ణా జిల్లా ఎస్పీ రాసిన లేఖని విడుదల చేశారు. తెనాలిలో శనివారం మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యం అన్నారు. గతంలో విశాఖలో పవన్ కళ్యాణ్ ని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అని గుర్తుచేశారు.