దేశ రాజధాని దిల్లీ నగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీ 20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాధినేతలు ఇక్కడికి వస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతాపరమైన చర్యలు పటిష్ఠంగా ఉన్నాయి. దీంతో సెంట్రల్ దిల్లీలోని పటేల్ నగర్‌లో ఓ వ్యక్తి డ్రోన్ కెమెరాను ఆకాశంలోకి ఎగరేసి చిక్కుల్లో పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పటేల్ నగర్ ప్రాంతంలో ఓ బర్త్‌డే పార్టీ జరుగుతుండగా అక్కడ ఫంక్షన్‌ను కవర్ చేసేందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్స్ వీడియో తీసేందుకు డ్రోన్ కెమెరాను గాల్లోకి ఎగరేసారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ జరగనున్నట్లు తెలిపారు. పోలీసులు, ఇతర అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా డ్రోన్ ఎగరేసినందుకు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జీ 20 సదస్సు నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయొద్దని నిబంధనలు పెట్టారు. సమావేశాలకు ఎలాంటి రాకూడదనే ఉద్దేశంతో దిల్లీ పోలీసులు చాలా అలర్ట్‌గా ఉన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా కూడా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. సెక్యురిటీ పెంచేందుకు పోలీసులు సదస్సు సమయంలో నో ఫ్టై జోన్ అని నిబంధనలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు కూడా పెట్టారు. సదస్సు ముగిసే వరకుయ అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే.
దిల్లీలో దేశాధినేతలు తిరిగే ప్రాంతాన్ని కంట్రోల్డ్ జోన్ -`1 గా చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఆదివారం రాత్రి 11.59 వరకు ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ ప్లేన్స్‌ను స్టాండ్‌బై మోడ్‌లో అందుబాటులో ఉంచారు. దిల్లీ ఆకాశంలో ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే స్పందించే విధంగా ఏర్పాట్లు చేశారు. యూఏవీ, డ్రోన్లకు కూడా అనుమతి లేదు. ఇందుకు సంబంధించి ఆగస్టు 29వ తేదీనే అధికారులు రాజధాని దిల్లీ నగరాన్ని నో ఫ్లై జోన్‌గా చేస్తున్నట్లు చెప్పారు.
జీ 20 శిఖరాగ్ర సదస్సు భారత్‌లో ఎంతో ఘనంగా నేడు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ స్వయంగా దేశాధినేతలకు భారత మండపం వద్ద స్వాగతం పలికారు. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్ సహా కెనడా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, యూరోపియన్ యూనియన్, జపాన్, మారిషస్ ఇలా 19 దేశాల నుంచి ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరి కోసం రాజధానిలోని లగ్జరీ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. దేశాధినేతలు, ప్రతినిధులు, అధికారులు, వారి సెక్యురిటీ సిబ్బంది ఇలా వేల మంది దిల్లీ, పక్కన ఉన్న గుర్‌గ్రామ్‌లలోని హోటళ్లలో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో సెక్యురిటీ కట్టుదిట్టంగా ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా భద్రత చాలా కఠినంగా ఉంటుంది. రష్యా, చైనా దేశాధినేతలు సమావేశాలకు హాజరుకావడం లేదు. వారికి బదులుగా ఇతర ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చారు.