Minister Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఎప్పుడో అరెస్టు కావాల్సిన వ్యక్తి అని మంత్రి జోగి రమేష్ అన్నారు. కానీ ఇప్పటికి ఆయన చేసిన పాపాలు పండి అరెస్టయ్యారని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన కారకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టులో ఏమాత్రం తప్పు లేదని పేర్కొన్నారు. మొత్తం 371 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును చంద్రబాబు అప్పనంగా మింగేశారని ఆరోపించారు. సిమెన్స్ అనే కంపెనీలో 3000 రూపాయలు కోట్లు పెట్టుబడి పెడతానని చెప్పి.. హవాలా మార్గం ద్వారా డబ్బులు కొట్టేశారని అన్నారు. దొడ్డ దారిన కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఈరోజు అరెస్టవ్వడం సంతోషమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఈ రాష్ట్రానికి శుభ పరిమాణం అంటూ చెప్పుకొచ్చారు. వేల కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విషయం అంటూ విమర్శించారు. 



















నిజాయితీ నిరూపించుకోవాలంటున్న సజ్జల


స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరగలేదని చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలని, వస్తున్న ఆరోపణలపై బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా హుందాగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్టుపై తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన సజ్జల.. స్కామ్ లో బాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా అరెస్టు చేస్తున్నారని అనడం సరైంది కాదన్నారు. ప్రాథమిక రిపోర్టులో లేనంత మాత్రాన అరెస్టు చేయకుండా ఉండరని చెప్పారు. 2017, 2018 లో రూ.371 కోట్లలో రూ.240 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయని వెల్లడించారు. షెల్ కంపెనీల ద్వారా ఇదంతా జరిగిందని అన్నారు.


అరెస్టు పై ముందే చంద్రబాబు మాట్లాడటం దేనికి నిదర్శనమని సజ్జల ప్రశ్నించారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి దర్యాప్తు చేయడం సర్వసాధారణమని చెప్పుకొచ్చారు. వాస్తవాలను ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, అసలు విషయం చెప్పకుండా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 9.12.21న ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందని గుర్తు చేశారు. సీఐడీకి చెందిన సిట్ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. స్కామ్ లో బాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయన్న సజ్జల.. స్కామ్ లో దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.