మన జనాభాలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ. ప్రతిరోజూ ముక్క లేనిదే ముద్ద దిగని వారెందరో. కానీ మాంసాహారాన్ని అధికంగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గుండెపోటు, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలను పాటించాలి. వాటిలో ఒకటి మాంసాహారం తగ్గించడం. అలాగే మద్యపానం, ధూమపానం కూడా తగ్గించాలి. వ్యాయామం రోజు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని మీకు మీరే తగ్గించుకున్న వారు అవుతారు.


మాంసాహారానికి, గుండె జబ్బులకు ఏమిటి సంబంధం? అని చాలామందికి సందేహం రావచ్చు. గుండె జబ్బులు అధికంగా వచ్చేది గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడే. మాంసాహారం తినడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే సమస్య పెరుగుతుంది. దీనివల్ల రక్తసరఫరా గుండె నుంచి అవయవాలకు తిరిగి అవయవాల నుంచి గుండెకు సరిగా జరగదు. దీనివల్లే గుండెపోటు వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని తగ్గించుకోవడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు.


మాంసాహారంలో కొలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎల్ కార్నిటైన్ అనే రసాయనం కూడా ఉంటుంది. జీర్ణం అయ్యాక కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ రసాయనాలు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి సహాయపడతాయి. నిజం చెప్పాలంటే హై బీపీ, రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కన్నా కూడా విడుదలైన ఈ రసాయనాలే ఎక్కువగా గుండె జబ్బును కలిగించే అవకాశం ఉంది. రక్తనాళాల్లో పూడికలు ఏర్పరిచే ఛాన్సులు అధికం. దీని వల్ల గుండె పోటు ఎప్పుడైనా రావచ్చు.


కాబట్టి మాంసాహారాన్ని తగ్గించుకుంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే సమస్య తగ్గుతుంది. తద్వారా గుండెను కాపాడుకోవచ్చు. పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మాంసాహారాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినాలి. ప్రతిరోజూ తినడం మానుకోవాలి.  మాంసాహారం తినేవారిలో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంది. వాటి బారిన పడకుండా ఉండాలంటే మాంసాహారాన్ని తగ్గించాలి. మాంసాహారం తగ్గించడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం తగ్గుతుంది. శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అన్నీ ఆరోగ్యకరమైన మార్పులు కలుగుతాయి. మాంసాహారం అధికంగా తినడం వల్ల కోపం, అసహనం వంటివి తగ్గుతాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవకణాలు దెబ్బతినకుండా ఉంటాయి. మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మాంసాహారాన్ని తగ్గించుకుని పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి అధికంగా తినాలి. 



Also read: పిల్లలకు గంట కంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారా? వారి ఆరోగ్యం మీరే చెడగొడుతున్నట్టు లెక్క


Also read: కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న, రెండింట్లో ఏది బెటర్?






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.