పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. పీఆర్సీ విషయంపై ప్రభుత్వంపై నిరసనగా వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం సీఎస్ సమీర్ శర్మకు నోటీసులిచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో హైకోర్టులో పీఆర్సీ జీవోలపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


ఉద్యోగుల జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. తర్వాతి విచారణకు సమ్మెకు నోటీసులు ఇచ్చిన 12 ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకావాలని హైకోర్టు చెప్పింది. జీతాలు పెంచే అధికారం, తగ్గించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. నిజానికి పీఆర్సీ పర్సంటేజ్‌లపై ఛాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని వ్యాఖ్యానించింది. పూర్తి సమాచారం లేకుండా ఎలా పిటిషన్ వేస్తారని... అసలు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని ప్రశ్నించింది.


ప్రభుత్వంపై యుద్ధం చేయడం లేదు: ఉద్యోగ సంఘాలు


ఉద్యోగులు ప్రభుత్వంపై యుద్ధం చేయడం లేదని ఉద్యోగుల జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు.  ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రభుత్వం, వైసీపీ నేతలు ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాల్సిన ప్రభుత్వం దానిని విరుద్ధంగా రెచ్చగెట్టే వాతావరణం సృష్టించకూడదని హితవు పలికారు. ఉద్యమ సమయంలో ఆవేదనతో మాట్లాడిన వారిపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వాలంటీర్ల ద్వారా ఉద్యోగులపై దుష్పచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ రానివ్వడం లేదని బొప్పరాజు తెలిపారు. పీఆర్సీ నివేదికపై చర్చించకుండానే నివేదిక ఇవ్వడంపై నిరసన తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఉద్యమంలో ఎవరూ రాజకీయ, వ్యక్తిగత దూషణలు చేయవద్దని బొప్పరాజు కోరారు. 


ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పోరాడుతున్నాయి


పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీపై చర్చల సమయంలో సమన్వయలోపంతో నష్టం జరిగిందని ఆయన అన్నారు. అందుకే ఇప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పోరాడుతున్నాయన్నారు. పీఆర్సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. అశుతోష్‌ మిశ్ర నివేదిక బయటపెట్టాలని కోరారు. 


కొత్త పీఆర్సీ బలవంతంగా అమలు సరికాదు


పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటేనే ప్రభుత్వంతో చర్చలు ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. మంత్రుల కమిటీ ఏర్పాటుపై మీడియాలో చూశామని, ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు అధికారంగా కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని ఆయన అన్నారు. కొత్త పీఆర్సీని బలవంతంగా అమలుచేయడం సరికాదని ఆయన అన్నారు. రాజకీయ వివాదాలకు తావు ఇవ్వకుండా ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.


 Also Read: AP PRC Issue: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన


Also Read: PRC: సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి.. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్