Rains In AP And Telangana: ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి అనుబంధ ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం చోడవరంలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 4 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరోవైపు, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవన ద్రోణి సూరత్ గఢ్, రోహ్‌తక్, ఒరై, మండ్లా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలోని అల్పపీడన కేంద్రం నుంచి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 9 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. శుక్రవారం (సెప్టెంబర్ 6) ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు.
కాగా, గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ఉద్ధృతితో విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరు వాగు ఉద్ధృతితో విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. సీఎం చంద్రబాబు గత 5 రోజులుగా కలెక్టరేట్‌నే కార్యాలయంగా చేసుకుని నిరంతరం పని చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందజేశారు. వరద పరిస్థితిపై అంచనా వేస్తూ అధికారులకు తగు విధంగా ఆదేశాలిచ్చారు. అటు, తెలంగాణలోని ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాల ధాటికి తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. నిత్యవసరాలతో పాటు ఆర్థిక సాయం అందించారు.