Dhulipalla On Kakani : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగానే అరాచక పర్వానికి తెరతీశారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఏడు కేసులలో‌ కాకాణి ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రతిష్ఠ దిగజార్చేందుకు ఆయనపై అక్రమ ఆధారలతో ఆరోపణలు చేశారన్నారు. సోమిరెడ్డి పెట్టిన కేసులలో‌ ఏ1 ముద్దాయిగా  గోవర్థన్ రెడ్డి ఉన్నారని తెలిపారు. పోలీసుల విచారణలో  కాకాణి నకిలీ డాక్యుమెంట్ సృష్టించారని నిరూపితమైందన్నారు. ఈ కేసులో కాకాణి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారన్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డి పై ఉన్న కేసులు ఎత్తి వేసేందుకు  ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ఆ‌ జీవోను కోర్టు ‌కొట్టివేసిందని తెలిపారు. 


ఎస్పీ కట్టుకథ 


నెల్లూరు కోర్టులో ఉన్న ఎవిడెన్స్ కావాలనే దొంగలించారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. కుక్కలు మొరగడంతో దొంగ భయపడి కాకాణి ఎవిడెన్స్ ఉన్న రూంలోకి వెళ్లారని ఎస్పీ కట్టుకథలు చెబుతున్నారన్నారు. రూమ్ తాళాలు దొంగ పగలగొడితే మరి బిరువా తాళాలు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మంత్రిగా శిక్ష పడుతోందన్న భయంతో ఈ చోరీ చేయించారన్నారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ఇలాంటి‌ సంఘటనతో దెబ్బతింటుందని ధూళిపాళ్ల ఆక్షేపించారు.  కాకాణి గోవర్థన రెడ్డి విల్లాలో‌ ఏసీ మెకానిక్  షేక్ మహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడని, ఆ మరణంపై అనుమానాలు ఉన్నాయని ధూళిపాళ్ల అన్నారు. చోరీ కేసుకు మహ్మద్ మృతికి ఉన్న సంబంధం తేల్చాలన్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించి సీబీఐ, జ్యుడీషియల్ విచారణ చేపడితేనే నిజం నిగ్గు తేలుతుందన్నారు. 


ఉద్దేశపూర్వకంగానే కోర్టులో చోరీ 


నెల్లూరు కోర్టులో చోరీ కేసు సంబంధించి ఎస్పీ కట్టుకథ బాగా చెప్పారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగి భయపడ్డారా అని ప్రశ్నించారు. కోర్టులో వేల కేసులు ఫైల్స్ ఉంటే కాకాణి కేసు ఆధారాలే ఎందుకు కనిపించాయి అని నిలదీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ చోరీ చేశారని ధూళిపాళ్ల ఆరోపించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చోరీలో పోలీసులు, కోర్టు ఉద్యోగుల ప్రమేయం, ప్రభుత్వ పెద్దల సహకారంపై విచారణ జరగాలన్నారు. కాకాణి మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే అరాచకాలు మొదలుపెట్టారని ఆరోపించారు. నెల్లూరు కోర్టు చోరీ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 


Also Read : Nellore Court Theft Politics : కొలంబియా తర్వాత నెల్లూరులోనే ! కోర్టు చోరీ ఘటనపై రాజకీయ కలకలం