గుంటూరు జిన్నా ట‌వర్ వ‌ద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం చారిత్రక ఘటన అని హోంమంత్రి మేకతోటి సుచ‌రిత అన్నారు. ఎందరో వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నామ‌న్నారు. గుంటూరు జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు హోంమంత్రి. సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు. ‌వివాదం సృష్టించడం సిగ్గు చేటని విమర్శించారు. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరంగా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బీజేపీ కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ విభజన రాజకీయాలకు జాతీయ జెండా ఆవిష్కరించి మంచి ముగింపు ఇచ్చామని తెలిపారు. 



ఎందరో మహానుభావుల త్యాగమే స్వాతంత్య్రం 


ఓల్డ్ గుంటూరు జిన్నా టవర్ వద్ద జరిగిన జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, జియా ఉద్దిన్, చంద్రగిరి ఏసురత్నం, రాము, ఇతర వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే ఇవాళ మనం స్వేచ్ఛ, స్వతంత్ర్యాలు అనుభవిస్తున్నామన్నారు. 


రాజకీయ లబ్దికోసం బీజేపీ పాకులాట 


'గుంటూరు నగరంలో జిన్నా టవర్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడ చాలా మంది పుట్టి ఉండరు. స్వాతంత్ర్యానికి ముందు భారత ప్రజల ఐక్యతకు చిహ్నంగా జిన్నా టవర్ ను నిర్మించారు. భారత సరిహద్దుల్లో వీర జవాన్ లు కాపలా ఉండటం వల్లే మనమందరం ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నాం. ఈ జవాన్ లలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు ఇలా ప్రతి ఒక్కరూ ఉంటారు. జిన్నా టవర్ విషయాన్ని బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం బాధాకరం, సిగ్గుచేటు. మానవాళికి మంచి చేసిన వారిని స్మరించుకోవడం భారతీయులకు అలవాటు. దేశాన్ని పాలిస్తున్న పాలకులు సమానంగా చూడాల్సింది పోయి.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం అత్యంత బాధాకరం. భారతదేశం గణతంత్ర, లౌకికరాజ్యం అని భావిస్తూ ప్రజలందరూ ఐకమత్యంగా, సోదర భావంతో కలిసి జీవిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ కులాలు, మతాలు, పార్టీలు అని చూడకుండా ప్రతి ఒక్కరూ లబ్దిపొందేలా సంక్షేమ పాలన చేస్తున్నారు. బీజేపీ మాత్రం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ లు వేరు అని మాట్లాడటం తగదు. ముందుగా మనమందరం భారతీయులం ఆ తరువాతే హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అని సోదర భావంతో జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరం కలిసి దీపావళి, రంజాన్, క్రిస్మస్ పండుగలను జరుపుకుంటాం. భారత ప్రజలందరూ ఐకమత్యంగా సోదర భావంతో ఉంటున్నాం కాబట్టే ప్రశాంతంగా జీవిస్తున్నాం' అని హోంమంత్రి సుచరిత అన్నారు.


Also Read: గుంటూరు జిన్నా టవర్‌కు జాతీయ పతాకం రంగులు.. నేతల మధ్య సద్దుమణిగిన వివాదం