Ysrcp Bus Yatra : వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మూడో రోజు నర్సారావుపేటకు చేరింది. నర్సారావుపేట సభలో మంత్రుల మాట్లాడారు. సామాజికన్యాయాన్ని సీఎం జగన్ ఫిలాసఫీగా భావించారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అందుకే బడుగు, బలహీనవర్గాలకు ఎన్నో పదవులు ఇచ్చారన్నారు. దేశంలో ఆనాటి వ్యవస్థలో శూద్రులకు ఎక్కడా ఆదరణ దక్కలేదన్నారు. వివిధ వృత్తులపై ఆధారపడి బతుకుతున్న వారికి సమాజంలో గౌరవం కూడా ఉండేది కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆ వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. కానీ సీఎం వైయస్‌ జగన్‌ సామాజిక న్యాయాన్ని ఫిలాసఫీగా భావించడం వల్లనే మంత్రివర్గంలో 70 శాతం బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇచ్చారన్నారు. ఇతరులకు అధికారం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదన్న ధర్మాన.. ఎంతో విశాల భావం ఉంటే తప్ప, అది సాధ్యం కాదన్నారు. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ 22వ స్థానంలో ఉందన్న ధర్మాన... ఇది గమనించి సీఎం ఆ దిశలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారన్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి, పిల్లలకు విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. దాదాపు రూ.1.30 లక్షల కోట్లు నేరుగా నిరుపేదలకు బదిలీ చేశారన్నారు. దీంట్లో ఎక్కడా అవినీతి, అక్రమాలు, వివక్షకు తావు లేకుండా చూశారన్నారు.


సామాజిక విప్లవం 


రాష్ట్రంలో ఇప్పుడు సామాజిక విప్లవం కొనసాగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇవాళ సామాజిక న్యాయంలో ఒక విప్లవం కొనసాగుతోందన్నారు. కానీ వాస్తవ సామాజిక న్యాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏపీలో కనిపిస్తోందన్నారు. గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పూర్తి న్యాయం చేస్తూ, వారికి అండగా ఉంటూ పాలించలేదని అది కేవలం సీఎం వైయస్‌ జగన్‌ వల్లనే సాధ్యం అవుతోందన్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏనాడూ బడుగు, బలహీనవర్గాలకు ఎక్కడా న్యాయం జరగలేదని ఆరోపించారు. దళితుల మీద యథేచ్ఛగా దాడులు జరిగాయని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు వద్దంటున్న చంద్రబాబుకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు.


మీ తలరాతలు మారుస్తా


రాష్ట్రంలో సంక్షేమ, సామాజికన్యాయ విప్లవం నడుస్తోందని మంత్రి విడదల రజని అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నిజమైన సామాజికన్యాయం చేస్తున్నారని, గతంలో చంద్రబాబు రాజ్యసభ పదవుల్లో ఒక్కటి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వలేదని ఆరోపిచారు. ఈ మూడేళ్లలో 8 రాజ్యసభ పదువులు వస్తే, వాటిలో 4 బీసీలకు సీఎం జగన్ ఇచ్చారన్నారు. మంత్రివర్గంలో 70 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించారన్నారు. అలాగే స్థానిక సంస్థల పదవులు, ఆలయాల కమిటీల్లో కూడా 50 శాతం బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో సంక్షేమ విప్లవం, సామాజికన్యాయ విప్లవం నడుస్తోందన్న మంత్రి... అందుకు తన నియోజకవర్గం చిలకలూరిపేట ఒక ఉదాహరణ అన్నారు. గతంలో అక్కడ ఎప్పుడూ బీసీలకు అవకాశం ఇవ్వలేదని, సీఎం జగన్ ఒక బీసీ అయిన తనకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడమే కాకుండా, మంత్రి పదవి కూడా ఇచ్చారన్నారు. నాడు సుభాష్‌చంద్రబోస్‌  ‘మీ రక్తం ఇవ్వండి. స్వాతంత్య్రం తెస్తాను’ అంటే ఇవాళ  సీఎం జగన్‌  ‘మీ ఓట్లు నాకివ్వండి. మీ తలరాతలు మారుస్తాను’ అన్నారని మంత్రి విడదల రజని అన్నారు.