Andhra Pradesh: లైంగిక వివక్ష అనే మానసిక రుగ్మత విషయంలో రాను రాను మార్పు కనపడుతోంది. భ్రూణ హత్యల వంటి దుర్మార్గాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఆడబిడ్డ అంటే అరిష్టం కాదు, అదృష్టం అనే విధంగా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు కనపడుతోంది. దీనికి తాజా నిదర్శనమే ఈ గణాంకాలు. లేబర్ ఫోర్స్ సర్వే విడుదల చేసిన తాజా గణాంకాలు భారత దేశంలో పెరుగుతున్న ఆడ పిల్లల సంఖ్యను తెలియజేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత మెరుగుపడటం ఇక్కడ విశేషం. 


ఏపీలో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పుట్టిన ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 1032గా ఉంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే ఈ వివరాలను బయటపెట్టింది. 2023 జులై నుంచి 2024 జూన్‌ వరకు ఈ సర్వే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆడబిడ్డల సంఖ్య పెరుగుతోందనేది ఈ సర్వే సారాంశం. 


కేరళ టాప్.. 
ఎప్పటిలాగే అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళ రాష్ట్రం ఆడబిడ్డల సంఖ్యలో కూడా తన మొదటి స్థానాన్ని నిలుపుకొంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మేఘాలయ నిలిచింది. ఒడిశా మూడో స్థానంలో ఉండగా.. ఏపీకి మరో పొరుగు రాష్ట్రం తమిళనాడు నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. టాప్-5లో మేఘాలయ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలు దక్షిణాదిలోనే ఉండటం విశేషం. 


దేశవ్యాప్తంగా చూస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. అయితే అమ్మాయిల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల కనపడుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలున్నారు. నేడు అంటే 2023–24 నాటికి ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 981కి పెరగడం విశేషం. ఇక ఆడబిడ్డల సంఖ్య అధికంగా ఉన్న కేరళలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,138 మంది అమ్మాయిలు ఉన్నారు. 


ఏపీలో గణనీయమైన పెరుగుదల.. 
గతంలో అంటే.. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలున్నారు. ఇప్పుడు 2023–24లో ఆ సంఖ్య ప్రతి వెయ్యిమందికి 1,032కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య కాస్త తక్కువగా ఉంది. గ్రామాల్లో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 1,019 కాగా, పట్టణాల్లో ఆ సంఖ్య 1,064 గా ఉంది. 


దేశం మొత్తం మీద 11 రాష్ట్రాల్లో అబ్బాయిలకంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. ఇక అబ్బాయిల సంఖ్య గరిష్టంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. హర్యాణాలో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు కేవలం 867 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా ఈ సంఖ్య దారుణంగా ఉంది. ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 837 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. 


Also Read: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు గుడ్ న్యూస్‌- దసరా నుంచి మరో పథకం అమలు !