Garuda Seva In Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు గరుడసేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
గరుడ వాహనం - సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
గరుడ సేవకు విశిష్ట స్థానం
సృష్టి కర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడు. కనుక గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి విలకట్టలేనని ఆభరణాలైన.. మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు. స్వామి ప్రసన్న వదనుడిగా శ్రీదేవి, భూదేవి లతో కలిసి గరుత్మంతుడిపై ఊరేగుతాడు. కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
స్వామి వారి వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవగా భక్తులకు భావిస్తారు. ఈ వాహన సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని. జ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైంది గరుడవాహనం. గరుడ వాహనంపై ఊరేగే స్వామి వారిని దర్శించుకుంటే.. ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.
ఏర్పాట్లను పరిశీలించిన భూమన
గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ఆలయ ఈవో ధర్మారెడ్డి, అధికారులతో కలిసి నాలుగు మాఢ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన.. టీటీడీ సీనియర్ అధికారులను, శ్రీవారి సేవకులను అభినందించారు. భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగు దొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులతో ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
గరుడ వాహన సేవ సందర్భంగా ఉదయానికల్లా గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం అయింది. తూర్పు-పశ్చిమ-ఉత్తరం-దక్షిణ మాడ వీధుల్లో గల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవకాశం ఉంది. భక్తుల కోసం ఉదయం 5 నుండి 6 గంటల మధ్య పాలు, కాఫీ, ఉదయం 6.30 నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఉదయం 10 గంటలకు సాంబార్ అన్నం, టమాటా అన్నం, స్వీట్ పొంగల్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు రెండు లక్షలకు పైగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సాయంత్రం సుండల్, కాఫీ, పాలు మళ్లీ అందజేశారు. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహనం ప్రారంభం కానుండగా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు వెజిటబుల్ కిచిడీ పంపిణీ చేశారని ఆలయ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు.
గ్యాలరీలలో వేచి ఉండే ప్రతి భక్తుడికీ గరుడ వాహనంపై ఉన్న శ్రీ మలయప్ప స్వామి వారి దర్శనం చేయించిన తరువాతే స్వామి వారు ఆలయానికి వేంచేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే గ్యాలరీల్లో లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తాను చాలా మందితో మాట్లాడానని, అందరూ టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు.