గత 14 రోజులుగా చంద్రుడి ఉపరితలంపై నిద్రాణ స్థితిలో (స్లీప్ మోడ్) చంద్రయాన్ 3లోని ల్యాండర్ విక్రమ్, ప్రగ్యాన్ రోవర్‌లను వేక్ అప్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. మళ్లీ గ్రౌండ్ స్టేషన్‌తో కమ్యూనికేషన్‌ని ఏర్పాటు చేయాలని సైంటిస్ట్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటిదాకా విక్రమ్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదని ఇస్రో అధికారులు తెలిపారు. వీటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేలా విక్రమ్, ప్రగ్యాన్‌ను స్లీప్ మోడ్ నుంచి వేక్ అప్ చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇస్రో అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ల్యాండర్, రోవర్ లు చంద్రుని దక్షిణ ధ్రువంలో 16 రోజుల పాటు స్లీప్ మోడ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన అక్కడ పగలు మొదలైంది. ఈ సమయంలో ల్యాండర్ ను, రోవర్ ను రీయాక్టివేట్ చేయాలని ఇస్రో ప్రణాళిక వేసింది. బుధవారం శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం చంద్రయాన్-3 దిగిన ప్రాంతంలో సూర్యోదయం జరిగిందని, బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లతో మళ్లీ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందజేసే సూర్యోదయం అవసరమని ఇస్రో తెలిపింది.