Sudha Murty: ప్రముఖ రచయిత్రి, మానవతా మూర్తి సుధా మూర్తి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె చేసే పనులు, నిరాడంబరంగా ఉండే తీరు పట్ల చాలా మంది ఆమెను ఎంతో అభిమానిస్తారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌, యూకే ప్రధాని అత్తగారు అయినప్పటికీ.. ఆమె సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారు. నిరాడంబరతకు ఆమె పెట్టింది పేరు. అలాంటి సుధా మూర్తి తీరు మరోసారి అందరి మనసులను గెలుచుకుంది. రద్దీగా ఉన్న ఓ విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికురాలిగా, తోటి ప్రయాణికులతో ఆమె మాటామంతీకి సంబంధించి వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. 


ఇండియా హెంప్ అండ్ కో సహవ్యవస్థాపకురాలైన జయంతి భట్టాచార్య ఈ విషయానికి సంబంధించి లింక్డ్‌ఇన్‌ పోస్టు పెట్టారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తితో జరిగిన హృదయపూర్వక సంభాషణ గురించి చెప్పుకొచ్చారు. ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధా మూర్తి సామాన్య ప్రయాణికురాలిగా.. తోటి ప్రయాణికులతో ప్రవర్తించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె హ్యుమిలిటీ, సింప్లిసిటీ గల అరుదైన వ్యక్తి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 


జయంతి భట్టాచార్య పెట్టిన పోస్టులో సుధా మూర్తి గురించి తన అభిమానాన్ని చాటుకున్నారు. దయ, తెలివితేటలు, నిరాడంబరత, సృజనాత్మకత గురించి తాను ఎప్పుడూ వింటూ ఉంటానని పేర్కొన్నారు. ఊహించని విధంగా సుధా మూర్తిని నేరుగా కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ పోస్టులో పేర్కొన్నారు. 'పద్మభూషణ్ అవార్డు గ్రహీత, యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ అత్తగారు అయిన సుధా మూర్తి.. ఓ సాధారణ వ్యక్తిలాగా తోటి ప్రయాణికులతో సన్నిహితంగా ఉన్నారు. తన ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇతర ప్రయాణికులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారితో కలిసి సరదాగా గడిపారు' అని జయంతి భట్టాచార్య తన పోస్టులో పేర్కొన్నారు.