Ramesh Bidhuri:
ఉగ్రవాది అంటూ విమర్శలు..
బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి లోక్‌సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీని ఉగ్రవాది అంటూ సంబోధించడం సభలో అలజడి సృష్టించింది. వెంటనే ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్రమత్తమైన ప్రభుత్వం రికార్డుల నుంచి ఆ వీడియోని తొలగించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్‌పై మాట్లాడే క్రమంలో రమేశ్ బిదూరి నోరు జారారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం అని ఓం బిర్లా వార్నింగ్ ఇచ్చారు. పదేపదే ఓ ముస్లిం ఎంపీపై అనుచిత పదజాలం వినియోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దనీష్ అలీ ఈ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంట్ సాక్షిగా తనను అవమానపరిచారంటూ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ రాశారు.
"కొత్త పార్లమెంట్ భవనంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. ఓ మైనార్టీ ఎంపీగా ఇలాంటి మాటలు పడడం చాలా బాధగా ఉంది. ఇంత గొప్ప దేశపౌరుడినై ఉండి, ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కోవడం కష్టంగా ఉంది"
- దనీష్ అలీ, బీఎస్‌పీ ఎంపీ
ప్రతిపక్షాల ఆగ్రహం..
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ ఎంపీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదం అదుపు తప్పుతోందని గమనించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆ బీజేపీ ఎంపీ తరపున క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించాలి అని కోరారు. కానీ ప్రతిపక్షాలు అప్పటికీ ఊరుకోలేదు. ఆ ఎంపీని సస్పెండ్ చేయాలని, లేదంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.
"బీజేపీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గు చేటు. రాజ్‌నాథ్ సింగ్ కేవలం క్షమాపణలు చెబితే సరిపోదు. ఇది పార్లమెంట్‌కే అవమానం. కచ్చితంగా ఆయనను సస్పెండ్ చేయాల్సిందే. ఆయన అనుచిత వ్యాఖ్యలతో దేశ పౌరుల్నే కించపరిచారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
గతంలో సభలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పలువురిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో సస్పెండ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీపై మండి పడుతోంది. లోక్‌సభ స్పీకర్ ముందే ఓ ఎంపీ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడమేంటని ఆప్ కూడా ప్రశ్నిస్తోంది.