MP Ramesh Bidhuri:
రమేశ్ బిదూరికి షోకాజ్ నోటీసులు
లోక్‌సభలో బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిపై హైకమాండ్ సీరియస్ అయింది. చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న క్రమంలోనే ఆయనకు అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో చేసిన అనుచితమైన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సౌత్ ఢిల్లీ ఎంపీగా ఉన్న రమేశ్ బిదూరి చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంపై మాట్లాడారు. ఆ సమయంలోనే BSPకి చెందిన కున్వార్ దనీష్ అలీ (Kunwar Danish Ali)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది అంటూ మండి పడ్డారు. ముస్లిం ఎంపీ అయిన అలీపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సభలో అలజడి సృష్టించింది. వెంటనే స్పీకర్ ఓం బిర్లా ఆయనను మందలించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై దనీష్ అలీ స్పందించారు. కొత్త పార్లమెట్ సాక్షిగా తనను అవమానించారని అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ ఓం బిర్లాకి లేఖ కూడా రాశారు. పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ లోని రూల్ 227 ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు ట్విటర్‌లోనూ ఓ పోస్ట్ పెట్టారు దనీష్ అలి. బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి వీడియో క్లిప్‌ని షేర్ చేశారు. RSS,ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు ఇవే నేర్పుతున్నారా అంటూ మండి పడ్డారు.
"నరేంద్ర మోదీ, RSS ల్యాబ్‌లలో ఇవే నేర్పిస్తున్నారా..? ప్రజలు ఎన్నుకున్న ఓ ఎంపీని ఉగ్రవాది అని లోక్‌సభలోనే అంటుంటే ఏమీ చేయలేకపోయారు. నాలాంటి వాళ్లకే ఇలాంటివి ఎదురైతే ఇక సాధారణ ముస్లింలకు ఈ ప్రభుత్వం ఏం చేయగలదు..? దీని గురించి ఆలోచించినా గుండె మండి పోతోంది"
- దనీశ్ అలీ, బీఎస్‌పీ ఎంపీ