Asian Games 2023: సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8 వరకు చైనా వేదికగా ఆసియా క్రీడలు - 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. క్రీడా సంగ్రామానికి సిద్ధం అవుతున్న వేళ చైనా మరోసారి తన బుద్ధి చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడిటేషన్లను నిరాకరించింది. కొన్ని రోజుల క్రితం చైనా ఓ మ్యాప్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అరుణాల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ లో అంతర్భాగంగా పేర్కొంది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులు భారత్ తరఫున ఆసియా క్రీడల్లో పాల్గొంటే.. ఆ ప్రాంతం భారత్ లో భాగమని తామే గుర్తించినట్లు అవుతుందని భావించిన చైనా.. తన దుర్భుద్ధిని బయటపెట్టింది. భారత క్రీడాకారులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్య పట్ల భారత్ శుక్రవారం నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు కేంద్ర  ప్రభుత్వం వెల్లడించింది.


చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అక్రిడిటేషన్, వీసా నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన క్రీడాకారుల పట్ల చైనా వివక్ష చూపిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. అరుణాచల్ భారత్ లో అంతర్భాగమే అని ఆయన స్పష్టం చేశారు. భారత అథ్లెట్లపై ఉద్దేశపూర్వకంగా చైనా ఇలా చేయడం ఆసియా క్రీడల స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని అరిందమ్ బాగ్చీ అన్నారు. భారత్ తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఆసియా క్రీడల స్ఫూర్తిని, నియమాలను చైనా ఉల్లంఘిస్తోందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. నివాస ప్రాతిపదికన భారతీయ పౌరుల పట్ల అవలంబించే భిన్నమైన వైఖరిని భారత్ తిరస్కరిస్తుందని అరిందమ్ బాగ్చీ అన్నారు. 


ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్ కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు విమానంలో బయల్దేరింది. అయితే వీరిలో ముగ్గురికి చైనా అనుమతి నిరాకరించడంతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ కు భారత ఆటగాళ్లను అధికారులు తీసుకువచ్చారు. అయితే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


భారత ఆటగాళ్లకు చైనాలో ప్రవేశం నిరాకరించడంపై ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఆతిథ్య దేశంగా, చట్టబద్ధంగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు హాంగ్‌జౌకు రావాలని చైనా అన్ని దేశాల అథ్లెట్లను స్వాగసతిస్తుందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా ప్రభుత్వం గుర్తించలేదని ఆ దేశ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ వ్యాఖ్యానించారు.