Ganta Srinivas :   తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయంగా ఇంకా యాక్టివ్ కావడం లేదు. అందరూ రోడ్డెక్కుతున్నా ఆయన మాత్రం ఇంకా రిలాక్సుడ్ రాజకీయాలే చేస్తున్నారు. సొంత పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఆయన కనిపించరు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే స్పందిస్తూ ఉంటారు. అదీకూడా సోషల్ మీడియాలో.తాజాగా ఆనపర్తిలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్న విధానంపై సోషల్ మీడియాలో స్పందంచారు. ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకునే స్థాయికి దిగజారడం అంటే నైతికంగా దిగజారడమే. నియంతృత్వం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రతీసారి రుజువైందని స్పందించారు. 






నాలుగేళ్లుగా టీడీపీతో దూరంగా ఉన్న గంటా 


ఆయన నాలుగేళ్లుగా సైలెంట్ గానే ఉన్నారు. మధ్యలో చాలా సార్లు పార్టీలు మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆయన టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లో యువనేతతో సమావేశం అయ్యారు. లోకేష్ పాదయాత్ర భారీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. అయితే లోకేష్  పాదయాత్ర ప్రారంభోత్సవానికి ఆయన కుప్పం వెళ్లలేదు. 


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే రాజీనామా చేసిన గంటా                        


గత నాలుగేల్ల కాలంలో అసెంబ్లీకి కూడా ఆయన హాజరవడం లేదు. వాస్తవానికి ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా స్పీకర్ వద్ద ఇంకా పెండింగ్‌లో ఉంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ కారణంగానే  అసెంబ్లీకి వెళ్లడం లేదని భావిస్తున్నారు.ఎన్నికలు దగ్గరకు వస్తూండటంతో..  తన నియోజకవర్గంలో టీడీపీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్‌ను ఇప్పుడే సమాయత్తం చేసుకుంటున్నారు. ఆయన టీడీపీలోనే ఉంటానని క్లారిటీ ఇవ్వడంపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 


ఇప్పుడు టీడీపీలో కొంత మంది నేతల వ్యతిరేకత - సైలెంట్‌గా గంటా                                


కానీ నాలుగేళ్లుగా కేసుల పాలై కష్టపడుతున్న అనేక  మంది నేతలు మాత్రం ఇప్పుడు గంటాకు ప్రాధాన్యం ఇస్తే అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది.  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎవడండీ గంటా అంటూ స్పందించిన తీరు సంచలనంగా మారింది. ప్రతీ సారి సీటు మార్చుకునే అలవాటు ఉన్న గంటా శ్రీనివాసరావు ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఆయన మాత్రం అప్పుడప్పుడు టీడీపీకి గిగిలింతలు పెడుతున్నారు. ఆయన మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో కానీ..  టీడీపీ నేతలు మాత్రం ఆయన గురించి మర్చిపోవడం ప్రారంభించారు.