తెలుగుదేశం అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై అధికార వైసీపీ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. అసలు చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకమే లేదన్నారు మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్. అందుకే అధికారులపై, అధికార పార్టీ నేతలపై చివరకు తనకు రక్షణగా ఉండే పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 


రాష్ట్రంలో పోలీసుల రాజ్యం కూడా కాదు రౌడీరాజ్యం నడుస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై వైసీపీ దాడి తీవ్రం చేసింది. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు మంత్రి వేణుగోపాల్. ప్రతిపక్ష నాయుకుడు సైకోలా వ్యవహహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిందేనంటూ కామెంట్ చేసిన మంత్రి... పోలీసుల పట్ల కూడా చంద్రబాబు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు చంద్రబాబుతోపాటు తెలుగుదేశం నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 


ప్రస్ట్రేషన్‌లో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు మరో మంత్రి దాడిశెట్టి రాజా. గత ఎన్నికలతోపాటు ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ది చెబుతున్నా చంద్రబాబుకు అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్‌లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. 


శుక్రవారం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి వెళ్లేందుకు యత్నించడం సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే తర్వాత ఆయన పాదయాత్రగా ఏడు కిలోమీటర్లు వెళ్లి సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... సహాయ నిరాకరణ చేస్తున్న ప్రతి పోలీసును గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. సీఎం జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ అంతానికి ఇది ప్రజాతిరుగుబాటు అన్నారు. పోలీసులు దారి ఇవ్వకపోతే ముందుకు దూసుకెళ్తామన్నారు. ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామన్నారు.  రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయిందని చంద్రబాబు అల్టిమేటం జారీచేశారు.  


సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగం 


అనపర్తి దేవీ చౌక్ వద్ద పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సభ నిర్వహించకూడదని చెప్తూ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. టీడీపీ కార్యకర్తల సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని చంద్రబాబు అన్నారు. అనపర్తిలో సభకు అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేశారని మండిపడ్డారు. జగ్గంపేట, పెద్దాపురం వెళ్తే పోలీసులు సహకరించారని, అనపర్తిలో గ్రావెల్‌ సూర్యనారాయణ వల్ల పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  ఖబడ్దార్‌ గ్రావెల్‌ సూర్యనారాయణ, నాతో పెట్టుకుంటున్నావు అంటూ హెచ్చరించారు.   జగన్ చెప్పినట్లు చేస్తే అధికారులు ఇబ్బంది పడతారని, తర్వాత నా దగ్గరే పనిచేయాలి గుర్తుపెట్టుకోవాలని పోలీసులను హెచ్చరించారు.  పోలీసులు ఇవాళ ప్రవర్తించిన తీరుకు ఆ యూనిఫామ్‌ సిగ్గుపడుతుందన్నారు. అనపర్తి నుంచే పోలీసులకు సహాయక నిరాకరణ ప్రారంభించామని చంద్రబాబు ప్రకటించారు. పోలీసుల సరిగాలేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మిమ్మల్ని కూడా జైల్లో పెట్టిస్తానన్నారు. ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ప్రభుత్వం అడ్డుపడిందా అని ప్రశ్నించారు. అప్పుడు లేని ఆంక్షలను ఇప్పుడెందుకు అని నిలదీశారు. ఒక మాజీ సీఎంపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. తానేమైనా పాకిస్థాన్‌ నుంచి వచ్చానా, ఎందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదన్నారు.