ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఇదో అధికారంలోకి వచ్చేస్తున్నామన్న పార్టీలో విభేదాలు పెద్ద సమస్యగా మారుతోంది. కీలకమైన నేతలు పార్టీ వీడుతున్నా... ముఖ్యమైన నేతలపై ఆరోపణలు వినిపిస్తున్నా రాష్ట్రాధ్యక్షుడు స్పందించడం లేదు. ఇంతకీ పార్టీలో ఏం జరుగుతోందని కేడర్‌ అయోమయంలో ఉంది. 


తాను పార్టీ మారడానికి ఆ ఇద్దరే కారణం అన్నారు కన్నా లక్ష్మీ నారాయణ. ఆ ఇద్దరు ఏంటీ.. ఆ మహానుభావులు అని చెప్పూ అంటూ జీవీఎల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పురంధేశ్వరి. ఇలా ఏపీ బీజేపీలో ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న అసంంతృప్తి మెల్లిమెల్లిగా బయటపడుతోంది. ఈ సంతృప్తికి కారణం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్‌ నరసింహా రావే అంటూ చాలా మంది నేతలు వారిద్దరివైపు వేళ్లు చూపిస్తున్నారు. 


రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. ఢిల్లీ నాయకత్వాన్ని పొడుగుతూనే... రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒంటెద్దు పోకడల కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు చెప్పుకొచ్చారు. పార్టీకి కొన్నేళ్ల పాటు రాష్ట్రపార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి, సీనియర్ నేత పార్టీ మారినప్పుడు కానీ, ఆయన చేసిన విమర్శలపై కానీ ఇంత వరకు ఎవరూ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన మాటలను ఖండించడం కానీ.. ఆయన చేసింది తప్పని చెప్పడం కానీ చేయలేదు. 


కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడిన తర్వాత రోజే మరో సీనియర్ నేత పురంధేశ్వరి జీవీఎల్‌పై వాగ్బాణాలు సంధించారు. ఆ ఇద్దరూ అంటూ వైఎస్‌, ఎన్టీఆర్‌ప విమర్శలు చేయాడాన్ని తప్పు పట్టారు. ఆ ఇద్దురూ అని కాదు ఆ మహానుభావులు అనాలంటూ సూచించారు. దీనిపై కూడా సోము వీర్రాజు నుంచి కానీ జీవీఎల్ నుంచి కానీ రియాక్షన్ రాలేదు. 


వీళ్లపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు.... మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర నాయకత్వంపై చాలా అసంతృప్తిగానే ఉన్నారు. ఢిల్లీ నాయకత్వం కారణంగానే ఇప్పటి వరకు పవన్ బీజేపీతో కలిసి ఉన్నారు. రోడ్‌ మ్యాప్ విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వంపై సెటైర్లు వేశారు. ఈ మధ్య కాలంలో కూడా పొత్తుల విషయంలో జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఇక్కడి వారికి అవగాహన లేదన్నట్టు మాట్లాడారు. 


అప్పట్లో రాజధాని అంశంలో కూడా గందరగోళం నడిచింది. ఓ వర్గం అమరావతికి అనుకూలంగా మాట్లాడితే జీవీఎల్ లాంటి వాళ్లు తేడాగా మాట్లాడేవాళ్లు. దీంతో ప్రతిపక్షాలు కూడా సోమువీర్రాజు, జీవీఎల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలక్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో అమరావతికి అనుకూలంగా మాట్లాడాలని నిర్ణయించారు. 


ఈ మధ్య కాలంలో జీవో నెంబర్‌ 1పై కూడా జీవీఎల్, సోమువీర్రాజు ఓ స్టాండ్ తీసుకుంటే... పార్టీలోని మిగతా నాయకులంతా వేరే స్టాండ్ తీసుకున్నారు. రాష్ట్రంలోని సమస్యలు, ఇతర అంశాలపై ఏకాభిప్రాయం లేకుండా జీవీఎల్, సోమువీర్రాజు ఓ దారిలో మిగతా నేతలంతా మరోదారిలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. 


ఇలా ఏపీ బీజేపీలో జీవీఎల్, సోమువీర్రాజు ఓవర్గంగా మిగతా సీనియర్, జూనియర్ నేతలంతా మరో వర్గంగా విడిపోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీని వల్ల బీజేపీ కేడర్‌ నలిగిపోతుందని చెబుతున్నారు కొందరు నాయకులు. సోమువీర్రాజు కానీ, జీవీఎల్‌ కానీ తెలుగుదేశాన్నిటార్గెట్ చేసుకున్నంతగా వైసీపీని టార్గెట్ చేయడం లేదని... అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయకుంటే ప్రజలు ఎలా హర్షిస్తారని లోలోపలే మధన పడుతున్నారు.


రాష్ట్ర పార్టీలో ఇన్ని జరుగుతున్నా నాయకత్వం స్పందించి కేడర్‌ క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ఒకరు పెట్టి కార్యక్రమాల్లో మరొకరు కనిపించడం లేదు. మొన్నటికి మొన్న పెట్టిన కార్యవర్గ సమావేశాలకి చాలా మంది జిల్లా నాయకులు డుమ్మా కొడ్డటానికి ఈ విభేదాలు, అసంతృప్తులే కారణమని టాక్ గట్టిగా వినిపిస్తోంది.