పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే అమరరాజ సంస్థను స్థాపించామని... ఆ సంస్థ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు అన్నారు. పెద్ద నగరాల్లో ప్లాంటును ఏర్పాటు చేేసే అవకాశం ఉన్నప్పటికీ వెనుకబడిన ప్రాంతమైన చిత్తూరు జిల్లాను ఎంచుకున్నామని చెప్పారు. సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలన్న తపనతోనే అమరరాజాను ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దామని చెప్పారు. అమరరాజ ఏర్పాటు చేసి 36ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సంస్థ ప్రస్థానాన్ని ఆయన వివరించారు.
అమరారాజా గ్రామీణ ప్రాంతంలోని భారీ పరిశ్రమ
అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణం.. మనదేశంలో గ్రామల్లో నివసించేవారే అధికంగా ఉంటారు. గ్రామీణులకు ఏదైనా చేయాలని చిన్నప్పుడే అనుకున్నానని గల్లా రామచంద్రనాయుడు తన ప్రస్థానాన్ని మీడియా ప్రతినిధుల ముందు గుర్తు చేసుకున్నారు. తన తండ్రి నిరక్ష్యరాస్యుడైనప్పటికీ.. ఆయన నుంచి ధైర్యం, ఇతర పాఠాలు చేర్చుకున్నానన్నారు. మామ రాజగోపాలనాయుడు స్ఫూర్తితో ప్రజాసేవలోకి వచ్చామని.. ఆయన సూచనలతోనే 18ఏళ్లు అమెరికాలో ఉండి స్వదేశానికి తిరిగి వచ్చామన్నారు. ఆ తర్వాత సొంత గడ్డకు మేలు చేయాలని.. గ్రామీణ యువతకు ఉపాధి అందించాలన్నఉద్దేశంతో పరిశ్రమను ప్రారంభించామన్నారు. పరిశ్రమకు సాగుభూమి వాడకూడదనే నిబంధన పెట్టుకున్నామని ఎప్పుడూ సాగుభూమిలో పరిశ్రమలు పెట్టలేదన్నారు. పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపామన్నారు. 1985లో చిన్న గ్రామం కరకంబాడిలో పరిశ్రమ విస్తరించి.. ఆ తర్వతా స్వగ్రామం పేటమిట్టలోనూ పరిశ్రమ స్థాపించానన్నారు. ప్లాంట్లన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మొదట కరకంబాడిలో రూ.2 కోట్లతో 22 మందితో పరిశ్రమ ప్రారంభించి... ఈ రోజుకు రూ.6 వేల కోట్ల స్థాయికి విస్తరించామని గుర్తు చేసుకున్నారు.
"అమరాన్" బ్రాండ్ బ్యాటరీలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఆ పారిశ్రామిక సంస్థకు ఇండియాలోనూ పలుకుబడి ఉంది. ప్రభుత్వానికి వందలకోట్లలో పన్నులు చెల్లిస్తోంది. అలాంటి సంస్థ కార్పొరేట్ ఆఫీస్ చిత్తూరు జిల్లాలోనే ఉందంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. రిజిస్టర్డ్ ఆఫీస్ కూడా చిత్తూరు జిల్లాలోనే ఉంది. దీనికి కారణం ఆ సంస్థను అక్కడ ప్రారంభించిన ఉద్దేశాన్ని మార్చుకోకపోవడమే. సొంత గడ్డపై యువతకు ఉపాధి కల్పించడానికి సొంత ప్రాంతానికి మేలు చేయడానికి గల్లా రామచంద్రనాయుడు ..అమెరికా నుంచి తిరిగి వచ్చి మరీ ఆ సంస్థను ప్రారంభించారు.అయితే ఈ సంస్థ పేరు ఈ మధ్యకాలంలో వార్తల్లో బాగా వినిపించింది. అమరాన్ సంస్థ తన కొత్త ప్లాంటును తమిళనాడులో ఏర్పాటు చేస్తోందని ప్రచారం జరగడం.. ఈ సంస్థ వెళ్లిపోవాలని తాము కోరుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించడం దుమారం రేపాయి. అమరరాజ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ ప్రభుత్వం అప్పట్లో నోటీసులు జారీ చేసింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేసింది. ఈ వివాదంపై ఆ సంస్థ ఎప్పుడూ పరిమితంగానే స్పందించింది. న్యాయపరంగా..చట్ట పరంగాతన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇలాంటి సందర్భంలో ఆ సంస్థ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు చిత్తూరులో ఓ ప్రత్యేకమైన సందర్భంలో సంస్థ ఆవిర్భావంతో పాటు ఏ ఉద్దేశంతోపెట్టారో... ఎలా అభివృద్ధి చేశారో వివరించారు.
పరిశ్రమ విషయంలో ఒక్కో అడుగు ముందుకు వేసి.. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ అత్యుత్తమైన ఉత్పత్తులు అందిస్తూ వచ్చాం..ఆర్థికాభివృద్ధి కోసం తాము చేయగలిగినంత చేశామన్నారు. పరిశ్రమలో విద్యార్హత లేనివారికి కూడా ఉద్యోగాలిచ్చి.. శిక్షణ ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఉద్యోగులుగా తీసుకునిప...ఉద్యోగులు ఇబ్బంది పడకుండా అన్నీ చర్యలు తీసుకున్నామన్నారు. మేం సమాజాభివృద్ధిని కోరుకున్నామని.. సొసైటీ కోసం మొదటిసారిగా మేమే ట్రస్టు కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 1990లో తొలిసారి ఆధునిక సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టామని... అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉత్పత్తుల తయారీ ఉంటుందని. ప్రభుత్వం చేస్తున్న కాలుష్యం ఆరోపణలపై పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం అమరరాజాలో సంస్థల్లో ఇప్పుడు 18 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందని.. సుమారు 60 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తోందన్నారు.
పారిశ్రామికంగా వెనుకబడిన చిత్తూరు జిల్లాలో 35 ఏళ్ల కిందట పరిశ్రమలు పెట్టేవారే లేరు. అలాంటి పరిస్థితిలో రామచంద్రనాయుడు అమెరికా నుంచి తిరిగి వచ్చి ... ప్రపంచ స్థాయి బ్యాటరీ బ్రాండ్‌ను రూపొందించారు. సంస్థను ప్రారంభించినప్పటి నుండి చైర్మన్‌గా ఉన్న రామచంద్రనాయుడు ఇప్పుడు బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన కుమారుడు గల్లా జయదేవ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.