ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ని హ్యాక్  చేసి పది వేల మంది కొత్త ఓటర్లను చేర్చేశాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. బీసీఏ చేసిన ఆ యువకుడు అదే ఉద్యోగంలా ఫీలవుతూ రోజూ చేసుకుంటున్నాయి. ఒక్కో నకిలీ ఓటర్‌కు ఇంత అని వసూలు చేసుకుంటున్నాడు. చివరికి ఎన్నికల కమిషన్‌కు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించి అసలు విషయం బయటకు లాగడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను అంత ఈజీగా హ్యాక్ చేసిన కుర్రాడికి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు.  కానీ ఆ హ్యాకింగ్ అదే పనిగా చేస్తూ... దొంగ ఓటర్లను చేరుస్తూ పోయాడు.


 యూపీలోని షహరాన్‌పూర్‌లో నివసించి విపుల్ శైని.. బీసీఏ చేశాడు. ఏ ఉద్యోగం చేయడం లేదు. కానీ ఎక్కడ పరిచయం అయ్యాడో.. ఎలా పరిచయం అయ్యాడో కానీ ఆర్మాన్ మాలిక్ అనే మధ్యప్రదేశ్ వ్యక్తితో నకిలీ ఓటర్లను చేర్పించే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఒక్కో ఓటర్ కార్డుకు రూ. వంద నుంచి రూ. రెండు వందల వరకూ వసూలు చేయడం ప్రారంభించాడు . గత మూడు నెలలుగా ఇదే పని చేస్తున్నాడు.  ఇప్పటి వరకూ కనీసం పది వేల మంది నకిలీ ఓటర్లను  చర్చి.. ఐడీ కార్డులను ప్రింట్ చేసినట్లుగా గుర్తించారు.  అతని బ్యాంక్ అకౌంట్‌లో  రూ. అరవై లక్షలు ఉన్నాయి.  విపుల్ సైని తండ్రి చిన్న స్థాయి రైతు మాత్రమే. దీంతో ఉన్న పళంగా  బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి నకిలీ ఓటర్ కార్డులపై విచారణ జరుపుతున్నారు. అసలు ఈ ఫేక్ కార్డులు తయారు  చేయమని ఆర్డర్స్ ఇచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన మాలిక్ ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 


విపుల్ సైనీని అరెస్ట్ చేసి... అతని ఇంట్లో కంప్యూటర్లను స్వాధీనం  చేసుకుని.. ఢిల్లీకి తరలించి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.  విపుల్ సైనీకి అదిపెద్ద నేరమని తెలియకపోయినా ఆయనకు ఆపని అప్పగించిన వాళ్లకు తెలుసని.. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఏమైనా ఓటర్ ఐడీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎన్నికల కమిషన్ తమ  సైబర్ సెక్యూరిటీ చాలా గొప్పగా ఉంటుందని చెబుతూ  ఉంటుంది. ఎవరూ హ్యాక్ చేయలేరని అంటూంటారు .కానీ ఇప్పుడు నేరుగా  ఓటర్ల జాబితాలను మ్యానిపులేట్ చేయగలిగేలా ఓ కుర్రాడు హ్యాక్ చేయడం కలకలం రేపుతోంది. ఆ పది వేల మంది ఫేక్ ఓటర్లను గుర్తించడం కూడా ఇప్పుడు తలకు మించిన భారంగా మారే అవకాశం కనిపిస్తోంది.