Gaddar Death News: ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు.  ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని గుర్తుచేసుకున్నారు. నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికిన గద్దర్ మరణం ఊహించలేమన్నారు. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందన్నారు. గద్దర్ లాంటి వ్యక్తుల మాటలు, పాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయన్నారు. ఈ కష్ట సమయంలో మనమంతా ఆయన కుటుంబ సభ్యులకు బాసటగా ఉందాం అని ఏపీ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.


టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం..
“ప్రజా గాయకుడు” గద్దర్ మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలియచేశారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్ అని కొనియాడారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్లు అయ్యిందన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 






ప్రజా గానం మూగబోయింది 
విజయవాడ: ప్రజల సమస్యలను తన గళంతో తెలియచేసి, బడుగుబలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ మంత్రి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజల వాణి ఆస్తమించిందన్న వార్త నన్ను చాలా కలిచివేస్తుందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. గద్దర్  కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల ఏపీ హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు జీవితాంతం అండగా నిలిచిన మహనీయుడు గద్దర్ అని ఆయన సేవల్ని కొనియాడారు. జానపదాలతో ప్రజలను ఆలోచింపజేసిన ప్రజానాయకుడు గద్దర్. ప్రజా గాయకుడి మరణం తెలుగు రాష్ట్రాల బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటు అన్నారు తానేటి వనిత.






ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.