Perni Nani : పాదాయత్రలో లోకేష్ అన్నీ అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కుప్పంలో ఇసుక వేస్తే రాలనంత జనం అన్నారు..ఒకసారి ఇసుక వెయ్యాల్సింది తెలిసేదన్నారు. భయం, బెరుకు లేకుండా లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. బందర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్‌ను టీడీపీ హయాంలో పూర్తి చేశారని, 5 ఏళ్ళల్లో 5 లక్షల ఉద్యోగాలను వాళ్ళ నాన్న ఇచ్చాడని, అమరావతిని పూర్తి చేయడంతో పాటు మోడీ మెడలు చంద్రబాబు వంచాడంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్పాడని మండిపడ్డారు. లోకేష్ చెప్పినట్లు ఇవన్నీ చంద్రబాబు చేస్తే.. మరి ప్రజలెందుకు మిమ్మల్ని కైమా కైమా చేసి ఇంటికి పంపించారు? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీని మీరు చక్కదిద్దితే ఇప్పుడు రోడ్లు ఎందుకు ఎక్కేవారని ప్రశ్నించారు. ఏమీ చెయ్యలేదు కాబట్టే ఇప్పుడు తిరుగుతున్నారని. సెటైర్ వేసారు.
అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా విమర్శలు చేస్తారా ?
పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమేంటని అన్నారు. లోకేష్ ప్రసంగాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని పేర్ని నాని అన్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం అనివార్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చెత్త నాయకుడని, ఎందుకు పనికి రాడని, అధికారంలోకి రాగానే కార్యకర్తలను పక్కన పెట్టేస్తాడని అచ్చెన్నాయుడు అంటున్నారని విశ్లేషించారు. చంద్రబాబుకు తన కొడుకు లోకేష్‌పై నమ్మకం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. కొడుకు పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌లో తండ్రి ఫోటో లేదని.. చంద్రబాబు బతికి ఉండగానే ఆయన ఫోటో లేకుండా లోకేష్ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పైనే నమ్మకం ఎక్కువ !
చంద్రబాబుకు తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్‌పైనే ఎక్కువ నమ్మకం ఉందని, కానీ ఆ దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తుంటారని సెటైర్లు వేశారు. ఏమాత్రం వ్యక్తిత్వం లేనివారితో తాము రోజూ పోరాటం చేయాల్సి వస్తోందని, ఇది నిజంగా దురదృష్టకరమని చెప్పారు. అయితే.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయలేరన్నారు. ఆ పార్టీలన్ని పొత్తు పెట్టుకున్నప్పటికీ.. వారికి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఈ విషయం చంద్రబాబు, పవన్‌కు బాగా తెలుసని.. ఎంతమంది, ఎన్ని పార్టీలతో కలిసొచ్చినా వైఎస్ జగన్‌ను అంగుళం కూడా కదపలేరని తేల్చి చెప్పారు.
పోలీసుల రక్షణ తీసుకుంటూ వారిని విమర్శించడం ఏమిటి ?
నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లోకేష్, చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే లోకేష్ ఎందుకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని ప్రశ్నించారు. పోలీసుల మధ్య బతుకుతూ వారి గురించి అసభ్యకరంగా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా ఒక్క నిమిషం కూడా బయటకు రాలేని నారా కుటుంబ సభ్యులు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటన్నారు. .