Balakrishna On Tarakaratna :   యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు తారకరత్న ప్రస్తుత పరిస్థితి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ... తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. బీపీ కంట్రోల్ లో ఉందని తెలిపారు. అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పారు. అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని అన్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారని అన్నారు. 


కుప్పంలోని డాక్టర్లు  మంచి చికిత్స చేశారని... ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకుగాని, మరెక్కడికైనా తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని... తాము బెంగళూరుకు తరలిస్తున్నామని బాలయ్య చెప్పారు. ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ, వాటిలో సరైన వైద్య పరికరాలు ఉండవని... అందువల్ల రోడ్డు మార్గంలో అంబులెన్సులో తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఆయన తాత ఎన్టీఆర్ గారు, నానమ్మగారి ఆశీర్వాదాలు, భార్య మాంగల్య బలం, అభిమానుల ప్రార్థనల వల్ల ప్రాణాపాయం లేదని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబుగారు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.


నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితి కొంత విషమంగానే ఉందనిబుచ్చయ్య చౌదరి తెలిపారు. బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్లే స్ట్రోక్‌ వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఎలాంటి స్టంట్లు వేయలేదు. తారకరత్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. తారకరత్నకు యాంజియో గ్రామ్‌ పూర్తయిందన్నారు.  తారక రత్న ఆరోగ్య పరిస్థితి మొదటికి ఇప్పటికి బాగా మెరుగుపడిందని.. ఇక లేదనుకున్న వ్యక్తి కోలుకున్నాడన్నారు. మాసివ్ అటాక్ రావడంతో కుప్పకూలిపోయాడని.. మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న మణిపాల్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారన్నారు.  చంద్రబాబు,బాలయ్య అన్నీ మానిటర్ చేస్తున్నారని.. అక్కడ వైద్యులతో కూడా మాట్లాడారని.. నిపుణుల బృందంతో అత్యాధునిక సౌకర్యాలున్న అంబులెన్స్ లో బెంగళూరు తరలిస్తామని ప్రకటించారు. 


తారకరత్నను మొదట కేసీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి ఆయన శరీరం బ్లూ కలర్‌లోకి మారింది. పల్స్ కూడా లేదు. దీంతో కేసీ ఆస్పత్రి వైద్యులు అత్యవసరం పీసీఆర్ నిర్వహించారు. దాదాపుగా నలభై ఐదు నిమిషాల తర్వాత తారకరత్నకు మళ్లీ పల్స్ వచ్చింది. గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో వెంటనే.. మరిన్ని మెరుగైన వసతులు ఉన్న ఆస్పత్రికి తరలించారు. యాంజియో ప్లాస్టీ చేసి స్టెంట్ వేసిన తర్వాత ... ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని వైద్యులు టీడీపీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. 


బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ చేశారు.  తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు.  బాలకృష్ణతో ఫోన్‍లో మాట్లాడిన తారకరత్న భార్య..ఇతర కుటుంబసభ్యులు మాట్లాడారు.  తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులకు   బాలకృష్ణ వివరించారు. యాంజియోప్లాస్టీ చేసి గుండె నాళాల్లో బ్లాక్స్ తొలగించి స్టెంట్ వేసినందున ఇక .. అత్యవసర వైద్యం కోసం  బెంగళూరు తరలించాల్సిన అవసరం కూడా లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.