జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ  జమున మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సీఎం అన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం లోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్నిపొందిన జమున గారు, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.




సీఎం జగన్ సంతాపం
‘‘తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌ మొద‌టిత‌రం నటీమణులలో అగ్రక‌థానాయ‌కిగా వెలుగొంది తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గని ముద్రవేసుకున్న జ‌మున గారు మృతి చెంద‌డం బాధాక‌రం. ఆవిడ‌ మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. జ‌మున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు.






జమున మృతి పట్ల రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం
సినీనటి జామున మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. జమున మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ భాషలలో వందలాది సినిమాలలో నటించడమే కాకుండా అగ్ర తరాల పక్కన నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జమున అని అన్నారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలని భాగవంతుణ్ణి కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.