Bail For Narayana : అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు , కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు మూడు నెలల ముందస్తు  బెయిల్ మంజూరు చేసింది. చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు  ముందస్తు బెయిల్ కోసం నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపంది.  నారాయణకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది పోసాని కోరారు. కింద కోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్‌లు వర్తించవని రిమాండ్‌ను తిరస్కరించిన అంశాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులోనే మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది పోసాని  గుర్తుచేశారు. వాదనలు విన్న హైకోర్టు... మూడు నెలల పాటు నారాయణ విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్‌లో అక్రమాలు జరిగాయని 2020లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ పేర్లను కూడా చేర్చారు. ఆ కేసుపై తాజాగా మంగళవారం ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచినప్పుడు..  అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ కేసు డైరీని ఎప్పటికప్పుడు కోర్టుకు ఎందుకు సమర్పించలేదని సీఐడీని న్యాయమూర్తి  ప్రశ్నించారు. ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ చట్టం ప్రకారం కేసు నమోదుచేసినా.. ఇందులో బాధితులెవరు.. మోసం చేసింది ఎవరని నిలదీశారు. బాధితులెవరైనా తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. భూముల వ్యవహారంలో నేరపూరిత కుట్ర ఉందని సీఐడీ చేసిన అభియోగాలపైనా న్యా యాధికారి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరిగిందో పేర్కొనలేదన్నారు. నిందితుల రిమాండ్‌ను తిరస్కరించారు.  


రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి   ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   ద‌ర్యాప్తున‌కు రావాలంటూ నోటీసులు అంద‌జేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.  ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాలంటే ద‌ళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థ‌ర్డ్ పార్టీ కింద కేసు న‌మోదు చేశారు. అప్పుడే ఈ అంశంపై దుమారం రేగింది. అదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా బాధితులెవరూ ముందుకు రాలేదు. తమ భూములు అన్యాయం తీసుకున్నారని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారు కూడా తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టం చేశారు. వారి వీడియోలను టీడీపీ అప్పట్లోనే విడుదల చేసింది. 


ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని.. అసలు బాధితులు ఎవరూ లేరని.. ఎవరో సంబంధం లేని వాళ్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి నష్టం జరిగిందని కానీ.. తమ భూములు లాక్కున్నారని కానీ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం ఈ కేసులో విశేషం అని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.