Care Hospitals: అమ్మకానికి పెట్టిన హైదరాబాదీ హాస్పిటల్ చైన్ 'కేర్ హాస్పిటల్స్' (Care Hospitals) మీద బడా కంపెనీలు కన్నేశాయి, కొనడానికి క్యూలో నిలబడ్డాయి. సుప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్టింగ్ కంపెనీ బ్లాక్‌స్టోన్ (Blackstone) తోపాటు సీవీసీ క్యాపిటల్ (CVC Capital), టెమాసెక్ (Temasek), మాక్స్ హెల్త్‌కేర్ (Max Healthcare) కూడా రేసులో ఉన్నాయి.
టీపీజీ గ్రోత్ (TPG Growth) పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎవర్‌కేర్ (Evercare) నుంచి కేర్ హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీ ఇవి పడుతున్నాయి. బ్రూక్‌ఫీల్డ్ (Brookfield) కూడా పోటీలో ఉందని తెలుస్తోంది.
రూ.7,500 కోట్ల విలువ
భారతదేశంలోని అతి పెద్ద హాస్పిటల్ చైన్లలో ఇదొకటి. 2,400 పడకలతో కూడిన భారత్‌లోని 15 ఆసుపత్రులు, బంగ్లాదేశ్‌లో రెండు ఆసుపత్రులు ఈ ఒప్పందంలో ఉన్నాయి. వీటి ఆధారంగా కేర్ హాస్పిటల్స్ విలువను సుమారు రూ.7,500 కోట్లు లేదా $950 మిలియన్లుగా లెక్కేశారు. ఈ లావాదేవీ పూర్తయితే, 2018లో IHH-Fortis కొనుగోలు తర్వాత మన దేశంలోని రెండో అతి పెద్ద ఆసుపత్రి కొనుగోలుగా మారుతుంది.
కొనుగోలు కోసం మొదటి రౌండ్ బిడ్స్ ప్రారంభమయ్యాయి. వీటి నుంచి రెండు, మూడు సంస్థలను కొన్ని వారాల్లో షార్ట్ లిస్ట్ చేస్తారు.
పెట్టుబడి బ్యాంకులు రోత్‌స్‌చైల్డ్, బార్ల్కేస్ (Rothschild, Barclays) విక్రయ ప్రక్రియలో TPGకి సలహాలు ఇస్తున్నాయి.
$375 మిలియన్ల ఆదాయం
FY23లో, $75 మిలియన్ల ఎబిటాతో $375 మిలియన్ల ఆదాయాన్ని కేర్ హాస్పిటల్స్ పోస్ట్ చేస్తుందని అంచనా.
1997లో, హైదరాబాద్‌లో 100 పడకలతో కార్డియాక్ హాస్పిటల్‌గా కేర్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 15 ఫెసిలిటీల నెట్‌వర్క్‌గా మారింది. 2,400 పైగా పడకలతో, భార్ & బంగ్లాదేశ్‌లో 30 క్లినికల్ స్పెషాలిటీలను అందిస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1,000 పడకలతో రెండు ఆసుపత్రులు ఉన్నాయి. ఇండోర్‌లోని CHL హాస్పిటల్స్‌ను రూ.350 కోట్లకు జులైలో కొనుగోలు చేసి, కొత్తగా 250 పడకలను యాడ్ చేసింది.
2018లో, కేర్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న అబ్రాజ్ గ్రోత్ మార్కెట్స్ హెల్త్ ఫండ్ నుంచి ఎవర్‌కేర్ కంపెనీ కేర్ హాస్పిటల్స్ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసింది. అదే సంస్థ ఇప్పుడు హాస్పిటల్‌ను అమ్మకానికి పెట్టింది.
హాస్పిటల్ స్పేస్‌లో, గత నెలలోనూ భారీ డీల్ జరిగింది. సహ్యాద్రి హాస్పిటల్స్ గ్రూప్‌లో మెజారిటీ వాటాను అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డ్ (Ontario Teachers’ Pension Plan Board) రూ.2,500 కోట్లకు ఆగస్టులో కొనుగోలు చేసింది.
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ 2016 నుంచి దాదాపు 22 శాతం CAGR వద్ద విస్తరిస్తోంది. ఈ రేటు ప్రకారం, 2022లో $372 బిలియన్లకు చేరుకుంటుందని 2021 నీతి అయోగ్ నివేదిక పేర్కొంది. భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ రంగంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.