Kothapalli Geeta :     అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఆదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆమె భర్త రామకోటేశ్వరరావుకూ ఐదేళ్ల జైలు శిక్ష విధించిది. ఇద్దరూ  చెరో లక్ష జరిమానా కూడా కట్టాల్సి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని దారి మళ్లించి తిరిగి కట్టలేని బ్యాంక్ అధికారులు ఫర్యాదు చేశారు. చాలా ఏళ్ల క్రితమే కేసు నమోదైంది. విచారణ జరిపిన సీబీఐ కోర్టు కొత్తపల్లి గీత నేరానికి పాల్పడ్డారని తేల్చింది. 


కంపెనీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకుని దారి మళ్లించారని ఆరోపణలు


విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు.  ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు రూ.2లక్షల జరిమానా విధించిన సీబీఐ కోర్టు. మంగళవారం ఈ కేసులో తీర్పు రావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది . గీత భర్త, బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.


ఇటీవల అమిత్ షాను కలిసిన కొత్తపల్లి గీత  


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీతో దూరం జరిగారు. బీజేపీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల సమయంలో ఏ పార్టీలోనూ చేరలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన వారిలో కొత్తపల్లి గీత కూడా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరుతుందన్న ప్రచారం జరిగింది.  అయితే చేరలేదు. ఈ లోపే ఆమె బ్యాంక్ ఫ్రాడ్ కేసులో జైలు శిక్షకు గురయింది. తనకు  బెయిల్ ఇవ్వాలని ఆమె తెలంగాణ  హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. 


ప్రభుత్వ ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా.. ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన గీత 


మొదట బ్యాంక్ ఉద్యోగిగా పని చేసి తర్వతా గ్రూప్ 1 పరీక్షల్లో విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.  1999వ సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ్ సబ్-కలెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ప్రొటెక్షన్), రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సర్వేలో స్పెషల్ ఆఫీసర్, ల్యాండ్ రికార్డులు మొదలైన పదవులలో పనిచేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న సమయంలో ఆమె భూముల అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 2010 లో  ఉద్యోగం మానేసి  భర్తతో కలిసి వ్యాపారం ప్రారంభించింది. తర్వాత వైఎస్ఆర్‌సీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో జైలు పాలవ్వాల్సి వచ్చింది. 


పార్టీని ప్రక్షాళన చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత - ప్రస్తుత టీంతో గట్టెక్కలేమని భావిస్తున్నారా ?