Village Secretariat In Andhra Pradesh: అమరావతి: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహించుకోవచ్చునని ఎన్నికల సంఘం (Election Commission) స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల విధుల్లో వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది పాత్రపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఆ సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు అప్పగించవచ్చునని స్పష్టం చేసింది. వీటికి అదనంగా మరే ఎన్నికల విధులను వారికి అప్పగించకూడదని ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ సూచించింది. కేవలం ఓటర్ల వేలికి ఇంకు పూసే పనికి మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకోవడంలో ఏ అభ్యంతర లేదని సీఈవోకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.
వాలంటీర్లకు ఎలక్షన్ డ్యూటీ అప్పగించొద్దు..
అదే విధంగా బీఎల్‌వో (BLO)లుగా పనిచేసిన సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీ సూచించింది. బీఎల్వోలుగా చేసిన వారికి ఓటింగ్ ఇతర పనులు అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీ పేర్కొంది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ అప్పగించొద్దని సీఈవోకు సూచించింది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా సైతం వాలంటీర్లను అనుమతించొద్దని స్పష్టం చేసింది. ఈసీ సూచనల మేరకు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులకు సీఈవో ఈ విషయాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు.