Statue of Rajiv Gandhi  in the Telangana Secretariat : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయం తీసుకుని వెంటనే శంకుస్థాపన కూడా  చేసేశారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి గారి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని.. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందని  రేవంత్ రెడ్డి శంకుస్థాపన సందర్భంగా అన్నారు.  టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ.. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేసుకున్నారు. 





 ఆయన విగ్రహం కేవలం జయంతి, వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికి కాదు.. మహానుభావుల విగ్రహాలు చూసినపుడు వారి స్పూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలగాలన్నారు.  ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని గుర్తు చేసుకున్నారు.  సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నన్ని రోజులు ఈ సందర్భం గుర్తుంటుందని.  అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.  విగ్రహావిష్కరణకు సోనియాగాంధీ  ని ఆహ్వానిస్తామని ప్రకటించారు.                               


అయితే రేవంత్ నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడింది. సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం అన్నారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరారు.                                                                      


 





 
మొత్తంగా రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ముందు వివాదాలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.