అనంతపురం కేంద్రంగా ఈబిడ్ (EBIDD) ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసి... బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని బాధిత ప్రజలు రాజకీయ నాయకులను వేర్వేరుగా ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన నేతలు.. ఈబిడ్ సంస్థ యాజమాన్యాన్ని బెదరించి వారి ఆస్తులు, విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇటీవల మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలతో పాటు కడప జిల్లాకు చెందిన మరో నేత హస్తం ఉందని ఆరోపించాయి. ప్రస్తుతం ఈబిడ్ కేసును సీఐడీ విచారిస్తోంది. దీంతో ఈ ముగ్గురు నేతలపై సీఐడీ నజర్ పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ‘ఈబిడ్’ వ్యవహారంలో కొత్త కోణం.. సంస్థ ప్రతినిధుల ఆస్తులను రాయించుకున్న ముగ్గురు నేతలు!
అసలేం జరిగింది?
అనంతపురానికి చెందిన కడియాల సంతోష్, కడియాల సునీల్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈబిడ్ సంస్థను ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థను గతేడాది అనంతపురంలోనూ స్టార్ట్ చేశారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ప్రజలను నమ్మించారు. తమ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ. 30 వేల చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేశారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. డిపాజిట్లు కట్టిన వారికి కొన్నాళ్లు నెలనెలా మొత్తం చెల్లించారు. దీంతో మరికొందరు డబ్బులు కట్టారు. సుమారు రూ. 300 కోట్ల డిపాజిట్లు వచ్చాక నెలవారీ చెల్లింపులను ఆపేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి.
Also Read: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణ కొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశం !
చక్రం తిప్పిన ముగ్గురు నాయకులు..
హిందూపురం పార్లమెంటు పరిదిలో ఇద్దరు ముఖ్య నేతలు ఈబిడ్ నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున ఆస్థులు రాయించుకున్నారని తెలుస్తోంది. ఒక నాయకుడైనే ఏకంగా అత్యంత ఖరీదైన రెండు వాహనాలను తీసుకొన్నాడని సమాచారం. సీఐడీ పోలీసులు ఈబిడ్ కేసు విచారణను ముమ్మరం చేయడంతో వాహనాలను తిరిగి ఇచ్చేశాడని తెలుస్తోంది. ఇక పులివెందులకు చెందిన మరో నాయకుడైతే ఏకంగా ముఖ్యమంత్రి పేరు చెప్పి నిందితుడి బంధువులను పులివెందులలో పెట్టి డబ్బులు వసూలు చేశారని వార్తలు వస్తున్నాయి.
ఏ నాయకుడికి ఎంత ఇచ్చారు?
ప్రస్తుతం ఈ నేతల వ్యవహారశైలిపై సీఐడీ సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే ప్రదాన నిందితుడైన సునీల్, ఆయన బార్యను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో ఏ నాయకుడికి ఎంత ఇచ్చారో అన్న వివరాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నేతలకు ఎక్కడెక్కడ ఆస్తులను రాసిచ్చాననే వివరాలను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో నేతలంతా అలర్ట్ అయ్యారు. సీఐడీ నివేదికలో తమ పేరు లేకుండా చూసుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వాహనాలు ఇప్పించుకున్న ఒక నాయకుడు కారును తిరిగి ఇచ్చేశాడు. తన అనుచరుడి పేరు మీద ఆస్తులను రాయించుకున్న మరో నేత సైతం.. ఆ ఆస్తులకు తనకు ఎలాంటి సంబంధం లేదని వారిస్తున్నట్లు సమాచారం.
Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాడు పని.. చైల్డ్ పోర్న్ వీడియోలతో రహస్య దందా.. పోలీసులు ఇలా కనిపెట్టేశారు
కేసును తప్పుదోవ పట్టించేందుకే..
ఈ వ్యవహారం కాస్త ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లిందని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్‌గా దృష్టి పెట్టడంతో నేతలు కూడా ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారని టాక్. ఇప్పటికు సీఐడీ అధికారులతో తమ పేరును చెప్పి నిందితులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వీరు మౌఖికంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ విషయంలో ఎలాంటి చర్యలైనా తీసుకుని బాధితులకు న్యాయం చేయమని ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. అయితే సదరు నేతలు ఈ విషయాన్ని మీడియా ముందు మాత్రం వెల్లడించట్లేదు. రాబోయే రోజుల్లో ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందో అనే టెన్షన్ అటు భాదితుల్లో, ఇటు రాజకీయ నేతల్లో నెలకొంది. ప్రధాన నిందితుడు డబ్బును ఎక్కడికి దారి మల్లించాడనే కోణంలో విచారణ సాగుతోంది. వాటిని ఎలా రికవరీ చేస్తారు.. భాదితులకు ఎలా అందిస్తారనేది తెలియాల్సి ఉంది.
Also Read: తెలుగు అకాడమీ స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!
Also Read: భారీ గోల్డ్ స్కామ్..! శ్రీకృష్ణ జువెలర్స్‌లో సోదాలు, కేసు పూర్తి వివరాలివే..