అనంతపురం కేంద్రంగా ఈబిడ్ (EBIDD) ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గతేడాది కార్యకలాపాలు నిర్వహించింది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి రూ. 300 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించింది. తీసుకున్న మొత్తం చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. బాధితులు తమకు న్యాయం చేయాలని ముగ్గురు రాజకీయ నాయకులను వేర్వేరుగా ఆశ్రయించారు. ఈ సమస్యను ఆయుధంగా మలుచుకున్న నేతలు.. కేసుల్లో ఇరికిస్తామని ఈబిడ్ సంస్థ నిర్వాహకుల్ని బెదిరించి.. వారి ఆస్తులను రాయించుకున్నారు. ఈబిడ్ నిర్వాహకులకు చెందిన రూ. కోట్ల విలువైన ఆస్తులను రాయించుకోవడంతో పాటు ఖరీదైన వాహనాలను బహుమతులుగా తీసుకున్నారు. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఈ రాజకీయ నాయకుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Also Read: అధిక వడ్డీ పేరుతో కుచ్చుటోపీ.. రూ.50 కోట్ల వరకు వసూలు.. జగిత్యాలలో ఓ వ్యాపారి మోసం..
రూ.5 కోట్ల ఆస్తులు..
అనంతపురం జిల్లాకు చెందిన ఓ నాయకుడికి తెలిసిన వారు కొందరు ఈబిడ్ కంపెనీలో రూ. 1.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. దీనిపై చర్చించేందుకు సంస్థ నిర్వాహకులను పిలిపించిన సదరు నాయకుడు రూ. 5-6 కోట్ల విలువైన ఆస్తులను తన అనుచరుల పేరిట రాయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా సంస్థ నిర్వహాకులపై ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే జిల్లాకు చెందిన మరో రాజకీయ నాయకుడిని మరికొందరు బాధితులు కలిసి తమ సమస్య గురించి చెప్పారు. ఆయన కూడా ఈబిడ్ నిర్వాహకుల నుంచి రెండు ఖరీదైన కార్లను బహుమతిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పలు పరిణామాలు చోటుచేసుకోవడంతో కార్లను వెనక్కు ఇచ్చేసినట్లు సమాచారం. మరికొందరు బాధితులు.. కడప జిల్లాకు చెందిన మరో నేతను కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. ఆయన కూడా ఈబిడ్ నిర్వాహకులను బెదిరించి భారీగా లబ్ధి పొందారని సమాచారం.
Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం
అసలేంటీ మోసం?
అనంతపురానికి చెందిన కడియాల సంతోష్, కడియాల సునీల్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈబిడ్ సంస్థను స్థాపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ కేంద్రంగా విధులు నిర్వర్తించేవారు. అయితే గతేడాది ఈ సంస్థను అనంతపురం రెవెన్యూ కాలనీలోనూ ప్రారంభించారు. తాము షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతామని ప్రజలను నమ్మించారు. ఎవరైనా తమ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ. 30,000 చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేశారు. దీనికోసం పెద్ద ఎత్తున ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. డిపాజిట్లు కట్టిన వారికి కొన్నాళ్లపాటు నెలనెలా డబ్బులు కూడా చెల్లించారు. దీంతో మరికొంత మంది దీనికి ఆకర్షితులై డబ్బులు కట్టడం ప్రారంభించారు. దాదారు రూ. 300 కోట్ల వరకు డిపాజిట్లు వచ్చాక నెలవారీ డబ్బులు చెల్లించడం ఆపేశారు. ఏమైందని అడిగితే సరైన కారణాలు చెప్పేవారు కాదు.
16 మంది ఫిర్యాదుతో..
కొన్నాళ్లకు తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో ఈబిడ్ సంస్థపై అనంతపురం జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలో కడియాల సునీల్ సహా మరో 17 మంది నిందితులుగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కేసుల నమోదు విషయం తెలియగానే.. సునీల్ పరారయ్యాడు.
Also Read: పవన్ కల్యాణ్ పర్యటనపై టెన్షన్.. టెన్షన్.. అక్కడ నో ఎంట్రీ అని చెప్పిన పోలీసులు
Also Read: ఎవరు గొప్ప అంటూ చెలరేగిన ఘర్షణ.. విద్యార్థి ప్రాణాల్ని బలిగొన్న కొట్లాట.. విశాఖలో దారుణం