Dokka Seethamma Mid Day Meal Scheme | డొక్కా సీతమ్మ.. ఈ పేరును జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. నేటి తరం యువతకు ఆమె గురించి పెద్దగా తెలియదు కానీ, మధ్య వయస్కుల్లో, ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి మాత్రం ఆమె గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సుమారు 180 ఏళ్ల కిందటే నిత్యాన్నదానాన్ని చేసిన గొప్ప మహిళ డొక్కా సీతమ్మ. ఇప్పుడు అంటే ఆర్థికంగా స్థిరత్వం కలిగిన ఎంతో మంది అన్నదానాన్ని సాగిస్తున్నారు.


ఆ రోజుల్లో నిత్యాన్నదానాన్ని కొన్ని సంవత్సరాలపాటు కొనసాగించిన గొప్ప మహిళ ఆమె. ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురైనా ఎదురీది ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టి ఆదరించిన మహిళా మూర్తి డొక్కా సీతమ్మ. ఆమె దాతృత్వాన్ని మెచ్చిన అప్పటి బ్రిటీష్‌ చక్రవర్తి తన పట్టాభిషేకానికి రమ్మని ఆహ్వానించినా అన్నదానానికి ఆటంకం కలుగుతుందని వెళ్లని మహిళా మూర్తి డొక్కా సీతమ్మ. 


తండ్రి సంస్కారాన్ని ఆలంబనగా చేసుకుని


డొక్కా సీతమ్మ 1841లో నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో(నేటి ఆంధ్రప్రదేశ్‌)ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో జన్మించారు. తల్లిదండ్రులు అనిపిండి నరసమ్మ, భవానీ శంకరం. భవానీ శం కరం దానానికి మారుపేరుగా నిలిచారు. ఆయన గ్రామంలోని ప్రజలకు అన్నదానం చేస్తూ బువ్వన్నగా పేరుగాంచారు. తండ్రి సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్న సీతమ్మ కూడా ఆయన బాటలోనే నడిచారు. తల్లి చిన్నతనంలో మృతి చెందడంతో ఇంటికి వచ్చే అతిథులకు మర్యాదలు చేయడం ద్వారా మనన్నలు పొందారు. చక్కటి భోజనాన్ని వండి వడ్డించడం ద్వారా అతిథుల మనన్నలను ఆమె అందుకున్నారు.


సీతమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, కథలు, పద్యాలు, గాథలు వంటి వాటిని అభ్యాసనం చేశారు. ఒకసారి లంకల గన్నవరం గ్రామానికి చెందిన ధనవంతుడు డొక్కా జోగన్న పంతులు సీతమ్మగారింటికి అపరాహ్న వేళ భోజనానికి వెళ్లారు. సీతమ్మ అణుకువ, ఆప్యాయత, భోజనం వడ్డించిన తీరు ఆయనను అమితంగా ఆకర్షించింది. ఆయనకు కూడా నలుగురికి అన్నం పెట్టి ఆదరించాలనే కోరిక ఉంది. సీతమ్మ మంచితనం, అణుకువ, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయతను చూపించే గుణం జోగన్నకి నచ్చాయి. దీంతో ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆయన.. తొమ్మిదేళ్ల వయసున్న సీతమ్మను వివాహం చేసుకున్నారు. మేడ్‌ ఫర ఈచ్‌ అదర్‌ అనిపించే సీతమ్మ డొక్కా వారింటి కోడలై డొక్కా సీతమ్మగా మారింది. భార్య, భర్తలిద్దరూ అన్నదానమంటే మక్కువ కలిగిన వాళ్లే. ఈ దంపతులు కుల, మత, భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా నిత్యాన్నదానాన్ని నిర్వహించేవారు. 


మంచి వాళ్లుగా మారిన గజ దొంగలు ఎందరో


అప్పట్లో ఆధునిక రవాణా సౌకర్యాలు లేవు. గోదావరీ తీర ప్రాంతాల్లో ఇప్పటికీ పడవ ప్రయాణం సాధారణ విషయమే. వీరి గ్రామమైన లంకల గన్నవరం నుండి అవతలి తీరాలకు, గ్రామాలకు పడవ లు ఎక్కువగా నడిచేవి. పడవల రవాణాకు ఈ ఊరు నెలవు. కాబట్టి చాలా మంది సీతమ్మ గారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లేవాళ్లు. వరదలు సంభవించినప్పుడు ప్రయాణీకులకు పడవులుండేవి కాదు. వారంతా అక్కడే ఉండాల్సి వచ్చినప్పుడు సీతమ్మ చేతి భోజనం తిని కాలం గడిపేవారు. అనావృష్టిలో కూడా నదిలో నీరు పడవ నడపడానికి సరిపడా లేకపోయేది. అప్పుడు ప్రయాణీకులకు ఆమె వండి వడ్డించేవారు. అర్ధరాత్రి పూట గజ దొంగలు కూడా తమ పని పూర్తి చేసుకుని ఆమె చేతి అన్నం పుష్టిగా తిని వెళ్లేవారు. కొంత మంది ఆమెను చూసి పశ్చాత్తాపపడి దొంగతనం కూడా మానేసేవారు. కొందరు రాజ వంశీకులు ప్రత్యక్షంగా ఆమె ఇంటికి రావడానికి మొహమాట పడి మారు వేషాల్లో వచ్చి భోజనం చేసి ఆమె వంటను రుచి చూసి వెళ్లేవాళ్లు. 


లంకె బిందెలతో కొనసాగిన అన్నదానం


కూర్చుని తింటే ఎన్ని ఆస్తులు అయినా తరిగిపోతాయి అంటారు. కానీ, సీతమ్మ దంపతులు కూర్చుని తినలేదు. వేలాది మందికి అన్నదానం చేసి పెట్టారు. ఆస్తి కూడా కరిగిపోయింది. చేతిలో ధనం ఖర్చు అయిపోయింది. అప్పుడు జోగన్న మనకే తినడానికి తిండి లేదు. అన్న దానానికి ఎక్కడి నుంచి తెస్తామని, అన్న దాన ప్రక్రియను ఆపేయాలని సీతమ్మకు సూచించారు. కానీ, ఆమె అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడని చెప్పి కొనసాగించారు. ఆ తరువాత కొద్దిరోజులకే వారి పొలంలో లంకె బిందెలో సంపద లభించడంతో నిత్యాన్నదానం కొనసాగింది. సీతమ్మ అన్నదానంతో సరిపెట్టలేదు. పేదల వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు ధనసాయం చేసేవారు. ఆ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పేదవారికి పలు విధాలుగా సహకారాన్ని అందించేవారు. 


పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం


సీతమ్మ అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకున్న బ్రిటీష్‌ సామాజ్యాధిపతి ఏడో ఎడ్వర్డ్‌ తన పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని కూడా అందించారు. అయితే, ఆమె మహా సముద్రం దాటని, ఓడెక్కని సాంప్రదాయబద్ధురాలు. అదే సమయంలో సుదూర ప్రాంతంలోని ఈ పట్టాభిషేకానికి వెళ్లి వచ్చేసరికి కొన్ని రోజులు సమయం పడుతుందని, దీనివల్ల కొన్ని రోజులపాటు అన్నదాన ప్రక్రియ నిలిచిపోవాల్సి వస్తుందని భావించిన ఆమె అందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. కనీసం, ఆమె చిత్ర పటాన్ని అయినా ఇవ్వాలని ఏడో ఎడ్వర్డ్‌ కోరడంతో అందుకు ఆమె అంగీకరించారు. పట్టాభిషేకం రోజు తన కుర్చీ పక్కనే మరో కుర్చీలో ఆమె చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి ఎడ్వర్డ్‌ పట్టాభిషేకం జరిగిందని చెబుతారు. 


కేన్సర్‌తో మృతి


డొక్కొ సీతమ్మ చేతికి కేన్సర్‌ సోకి వైద్యం తీసుకోకుండానే 1909 ఏప్రిల్‌ 28న పరమపదించారు. అంతా అన్నమో రామచంద్రా అంటే గోదావరి వాసులు, సీతమ్మ గురించి తెలిసిన వాళ్లు మాత్రమే.. అన్నమో సీతమ్మా అంటారు. ఈమె జీఇత చరిత్రను కొంతకాలం పాఠ్యాంశంగా పొందుపరిచారు. 1959లో మిర్తిపాటి సీతారామాంజనేయులు నిరతాన్నాధాత్రి శ్రీ డొక్కా సీతమ్మ గ్రంథాన్ని రాశారు. 


డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం


తాజాగా ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అన్నా కేంటీన్లకు కూడా డొక్కా సీతమ్మ పేరు ఏర్పాటు చేయాలని గతంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకంలో భాగంగా సోమవారం కూరగాయల పలావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ, బెల్లం చిక్కి, మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ, బుధవారం కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ, బెల్లం చిక్కీ, గురువారం సాంబార్ బాత్/లెమన్ రైస్, టమోటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ, బెల్లం చిక్కి, శనివారం ఆకుకూర అన్నం, పప్పు చారు, రాగి జావా, స్వీట్ సాంబార్ చిన్నారులకు వడ్డించనున్నారు.


Also Read: AP News: పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు గుడ్ న్యూస్! ఎంత స్థలం ఇవ్వాలో కీలక నిర్ణయం