House Plots for Poor in AP: ఏపీలో పేదలు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై సోమవారం (జూలై 29) నాడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా పాల్గొన్నారు. 


గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అయింది. ఇంకా శాఖ అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. వచ్చే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్దేశించారు.


వైసీపీ సర్కారు తాము నిర్మించిన ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందని చెప్పారు. ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చెల్లించని బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లుగా మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని నిర్ణయించినట్లు తెలిపారు.