East Godavari Politics : ఏపీలో ఎన్నికల వేళ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఆయువుపట్టు అయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు గల్లంతవుతున్నాయన్న ప్రచారంతో అసంతృప్తి సెగలు మరింత కాక రేపుతున్నాయి. ఇంఛార్జిల మార్పు అనివార్యమంటూ సంకేతాలు ఇచ్చి ఆగ్నికి ఆజ్యం పోసిన వైసీపీలో ఇప్పుడు చాలా మంది సిట్టింగ్‌లు పక్క పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
జనసేనతో టచ్‌లోకి వెళ్లిన పిఠాపురం ఎమ్మెల్యే
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ మార్పుపై సూచనలు ఇచ్చారు. పార్టీ మార్పు అనివార్యమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. వారు వద్దనుకున్నప్పుడు మనం పాకులాడడం ఎందుకు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తూర్పులో మరింత దుమారాన్ని లేపాయి. పిఠాపురంలోనే కాదు అమలాపురం, పి.గన్నవరం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనడమే కాదు.. తీవ్ర ఉత్కంఠను ఏర్పడేలా చేస్తోంది..
పిఠాపురం నుంచే మొదలా..?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, జగ్గంపేట నియెజకవర్గాల్లో పార్టీల ఇంచార్జిల మార్పు అనివార్యం అన్న సంకేతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా స్పష్టంగా వెల్లడించారు. ఇందులో పిఠాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని కాకినాడ ఎంపీ వంగా గీతను ఇప్పటికే ప్రకటించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఎమ్మెల్యే దొరబాబు వర్గీయులు అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనన ఎమ్మెల్యే పెండెం దొరబాబు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేయడంతోపాటు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఇప్పటికే జనసేన పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు, ఆయన తనకు జనసేన నుంచి పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ కేడర్ కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ముద్రగడపను పార్టీలో చేర్చుకుని ఓ సీటు ఇచ్చే అవకాశం
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెండెం దొరబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో తాడేపల్లి వెళ్లి ఉభయగోదావరి జిల్లాల ఇంఛార్జ్ మిథున్ రెడ్డితో సమావేశం అయ్యారు. అయితే కాకినాడ ఎంపీ నుంచి పోటీచేయాలని సూచించినట్లు, ఆయన దానికి తిరస్కరించినట్లు సమాచారం. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంత్రి విశ్వరూప్ సీటు మార్పు అనివార్యం అన్న సంకేతాలు పార్టీ అధిష్టాటనం ఇవ్వడంతో ఆయన నిరాశతో వెనుతిరిగి అమలాపురం చేరుకుని తన కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమయ్యారు. అయితే పార్టీ ఆయన తనయుడు శ్రీకాంత్ పేరును పరిశీలిస్తున్నప్పటికీ అది కూడా ఖరారు కాలేదు. తనకు పార్టీ కేడర్‌లో మంచి పట్టున్నప్పటికీ తనను తప్పించడం ఏంటని విశ్వరూప్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు అనుకుంటున్నారు. నిన్న జరిగిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో కూడా విశ్వరూప్ అంటీముట్టినట్లే వ్యవహరించారని, ఆయన పేరుమీద ఒక్క ఫ్లెక్సీను కూడా ఏర్పాటు చేయలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి విశ్వరూప్ ఇంట్లో టిక్కెట్ చిచ్చు
పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంచార్జ్‌ల నియామకాలు విశ్వరూప్ ఇంట్లో వివాదాలు రాజేసిందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను సమర్ధవంతంగా పనిచేసినప్పుడు తనను తప్పించి తన కుమారుడు, వేరే వారి పేర్లు పరిశీలించడం ఏంటని తమ వర్గీయుల వద్ద విశ్వరూప్ చాలా బాధపడినట్లు తెలుస్తోంది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పైకి తనను మార్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం శిరోధార్యమని చెప్పినా లోలోన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇక రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విషయంలోనూ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయం కూడా మింగుడు పడడం లేదని సమాచారం. ఆయన్ను అమలాపురం పార్లమెంటుకు పోటీచేయాలని ఇప్పటికే సూచించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.