బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ హఠాత్తుగా నిర్ణయించుకోవడం ఆ పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీనికి కారణం  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే అభ్యర్థిని నిర్ణయించి రంగంలోకి దిగిన పార్టీ ఇప్పుడు షెడ్యూల్ వచ్చాక వెనక్కి తగ్గడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తి చేయనప్పటికీ తమంతటకు తామే సంప్రదాయాలు పాటిస్తున్నామని టీడీపీ చెప్పుకుంది.


ఏకగ్రీవం చేయాలని సంప్రదాయంగా అడగని వైఎస్ఆర్ కాంగ్రెస్ ! 


బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదని పొలిట్ బ్యూరో నిర్ణయించినట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే భార్యనే అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఏకగ్రీవానికి సహకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పొలిట్ బ్యూరో భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ కూడా పోటీ చేయకూడదని నిర్ణయించింది.  బద్వేలులో ఎకగ్రీవానికి సహకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగలేదు. అయితే ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఇటీవల సంప్రదాయాలను గుర్తు చేశారు. చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉందన్నారు. అయితే సాధారణంగా ఇలా ఏకగ్రీవం చేయాలంటే గతంలో తమ పార్టీ తరపున ప్రతినిధుల్ని పంపి ప్రతిపాదన ఇచ్చేవారు. ఇతర పార్టీల వారు అంగీకరించేవారు. ఈ సారి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం సంప్రదాయాలను ఇతర పార్టీలకు గుర్తు చేశారు అంతే. దానికే టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టకూడదని నిర్ణయించుకున్నారు. 


Also Read : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?


2015 తిరుపతి అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ! 


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2015లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ చనిపోయారు. ఆయన స్థానంలో ఆయన భార్యకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఈ కారణం అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టలేదు. ఇతర రాజకీయ పార్టీలూ పోటీ పెట్టలేదు. అయితే ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయడంతో ఏకగ్రీవం కాలేదు. కాని దివంగత ఎమ్మెల్యే భార్య  సుగుణమ్మకు ఏకంగా లక్షా పది వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. 


Also Read : బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం.. జగన్ పార్టీకి భయపడేది లేదు.. సోము వీర్రాజు వెల్లడి


నంద్యాల అసెంబ్లీ, తిరుపతి లోక్‌సభలో మారిన పరిస్థితులు ! 


తిరుపతి అసెంబ్లీ ఉపఎన్నిక తరవాత నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలు జరిగాయి. అయితే ఈ రెండు చోట్ల హోరాహోరీ పోరు సాగింది. నంద్యాలలో ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి చనిపోవడంతో  ఆయన కుటుంబసభ్యుడు భూమా బ్రహ్మానందరెడ్డికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని నిలబెట్టింది. సీఎం జగన్ ఏకంగా నెల రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం చేశారు. దీనికి ఓ కారణం ఉంది. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. కానీ ఆయన తర్వాత టీడీపీలో చేరారు. తమ పార్టీ సీటు కాబట్టి ఏకగ్రీవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. అలాగే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ జరగడానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ చనిపోయిన ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబసభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఏకగ్రీవం అనే ప్రస్తావన రాలేదు. 


Also Read : బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు... స్పష్టం చేసిన పవన్ కల్యాణ్...


పోటీ చేసినా ఫలితం తేడా ఉండదనే వెనక్కి తగ్గారా ?


నిజానికి రాజకీయాల్లో సంప్రదాయాలు అనేది రాజకీయ పార్టీలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగానే పాటిస్తాయి. బద్వేలులో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం అనుకూల పరిస్థితులు ఉన్నా పోటీ చేసి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు.  బద్వేలు సంప్రదాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.  గత ఎన్నికల్లోనే 44వేలకుపైగా మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉండి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వరూపం చూపిస్తున్నారు. స్థానిక ఎన్నికల దగ్గర్నుంచి అన్ని చోట్లా ఇది టీడీపీకి అనుభవమైంది. అందుకే పోటీ చేయడం కన్నా సంప్రదాయం పేరుతో దూరంగా ఉండటం మంచిదని టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 


Watch Video : బద్వేల్ ఉపఎన్నికను బహిష్కరించిన చిన్నరాజు పల్లె. ఎందుకంటే ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి