ఆర్జీవీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చాలా అంటారు కానీ ఆర్జీవీ లాజిక్స్ అర్థం కాక అలా విమర్శిస్తారంటారు రామూయిజం ఫాలోవర్స్. ఏ కథనాన్నైనా తన దర్శకత్వ ప్రతిభతో రక్తి కట్టించగల నైపుణ్యుడు ఆర్జీవీ. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై వినూత్నంగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు సెన్షేనల్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ. ఆర్జీవీ ఏ సినిమా చేసినా.. ఏం మాట్లాడినా.. చివరకు చిన్న ట్వీట్ చేసినా సంచలనమే. సరిగ్గా రామ్‌గోపాల్‌వర్మ ఫార్ములానే వంటబట్టించుకున్న ఓ అభిమాని తన అభిమానానికి వ్యాపారం జోడించి సక్సెస్ అవుతున్నాడు. ఈ విషయం తెలిసిన రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'A hotel on my name... I feel DEAD' అంటూ ట్వీట్ చేశారు. దానికి సంబంధించి 'ఏబీపీ దేశం' యూట్యూబ్ లింక్ ను పోస్ట్ చేశారు. ఇంతకీ ఎవరా అభిమాని చూద్దాం...
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆర్జీవీ వీరాభిమాని వెంకటరమణ తన అభిమాన డైరెక్టర్ పేరుతో ఓ హోటల్ పెట్టి స్థానికంగా ఫేమస్ అయ్యాడు. ఈ యువకుని తల్లి, సోదరుడు కూడా ఆర్జీవీ వీరాభిమానులే. ఆయన ఫిలాసఫీకి ఫిదా అయినవారే. జిల్లాలో ఓడలరేవు వైపుగా ఎవరైనా కొత్తవారు వెళ్తుంటే బెండమూర్లంక సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ రామ్‌గోపాల్‌వర్మ ఫొటోతో కనిపించే హోటల్ చూసి ఓ లుక్కేస్తారు. ఇదేదో బాగుందే ఓసారి చూద్దాం అని లోపలకు వెళ్తే అక్కడ అంతా ఆర్జీవీ ప్రపంచమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రామ్‌గోపాల్‌వర్మ ఫొటోలు, పోస్టర్లు, రామ్‌గోపాల్ వర్మ పలు సందర్భాల్లో పలు వేదికలపై మాట్లాడిన సంచలన డైలాగులు దర్శనమిస్తాయి.
ఫ్యామిలీ మొత్తం ఆర్జీవీ అభిమానులే
ఆర్జీవీ అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఆయన చెప్పిన మాటలు ఓసారి నిధానంగా ఆలోచిస్తే అక్షర సత్యాలు అంటారు వెంకట రమణ. అందుకే ఆయన అంటే పిచ్చి.. హోటల్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడే మా అన్న, నేను నిర్ణయించేసుకున్నాం.. హోటల్ అంటే పెడితే ఆ పేరు రామ్‌గోపాల్‌వర్మ పేరునే పెట్టాలని అన్నారు. ఇక ఈ యువకుని తల్లి కూడా ఆర్జీవీకు వీరాభిమానే. అసలు ఈమె నుంచే అభిమానం కుమారులకు వారసత్వంగా వచ్చిందట. శివ సినిమా చూసినప్పుడు ఎవరీ డైరెక్టర్ అనుకుందట. అప్పటికే సినిమాలపై అవగాహన ఉన్న ఈమెకు శివ సరికొత్త అనుభూతిని ఇవ్వడంతో ఆర్జీవీను ఆరాధించడం మొదలు పెట్టింది. అంతే ఆ అభిమానం మరింత పెద్దదై ఇప్పుడు తన ఇద్దరు కుమారుల కూడా ఆర్జీవీ వీరాభిమానులయ్యారు.
ఆర్జీవీ చేతుల మీదుగా హోటల్ ప్రారంభించాలనే ఆకాంక్ష
రాబోయే రోజుల్లో కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా రాంగోపాల్ వర్మ హోటల్ పెట్టాలన్నది తన లక్ష్యంగా చెబుతున్నారు వెంకట రమణ. ఆర్జీవి అంటే వీరికి ఉన్న అభిమానం హోటల్లో ఒక్క దాని మీదే కాదు ఇంట్లోనూ, బైక్ పైన ఇలా ఎక్కడ చూసినా రాంగోపాల్ వర్మ ఫోటోలే కనిపిస్తాయి. హోటల్ వ్యాపారంలో బాగా స్థిరపడితే మంచి సిటీలో హోటల్ పెట్టి దాన్ని రామ్ గోపాల్ వర్మ చేతులమీదుగానే ప్రారంభించాలని తన ఆకాంక్ష అని ఈ యువకుడు చెప్తున్నాడు. తాను అభిమానించే వ్యక్తి.. తన హోటల్ గురించి ట్వీట్ చేయడంపై.. వెంకటరమణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: V EPIQ Shut Down: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత