Rains likely in AP, Telangana: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఉదయం చిరుజల్లులు కురిశాయని చెప్పారు. ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, విదర్భ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం కొన్నిచోట్ల మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. అర్ధరాత్రి కొన్ని చోట్ల చినుకులు పడతాయని, నగర శివార్లలో మోస్తరు వర్ష సూచన ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈ 15 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు
తెలంగాణ, బెంగాల్, ఒడిశా, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని వివరించారు. ఆపై ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు, ఏపీలోని కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
శని, ఆది వారాల్లో అక్కడ వర్షాలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఉపరితల ఆవర్తనం ఆనుకుని ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సోమవారం..
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనున్నాయి. ఏపీలోని ఒకటీ రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గాలిలో వేడి, తేమ కారణంగా వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. వర్షాలు లేని కొన్ని ప్రాంతాల్లో వేడి, తేమ అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read: BRS First List : 18వ తేదీన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ? - ఎంత మంది సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు ఖాయమా ?