కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రైతులకూ లబ్ది చేకూరుతోంది. ఏడాదికి రూ. ఆరు వేల చొప్పున అందుతోంది. అయితే ప్రతీ సారి లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. దీనికి అనేక సాంకేతిక కారణాలున్నా ఎవరూ సరి చేసేవారు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. పీఎం కిసాన్‌ను కలిపేసి ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో పథకం అమలు చేస్తోంది. ఇందులో రాష్ట్రం ఇచ్చే రూ. 7500 కలిపి రూ. 13500 ఇస్తోంది. కేంద్ర నిధులు రాకపోవడం వల్ల వారికి రూ. 7500 మాత్రమే అందుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పీఎం కిసాన్ కింద నమోదైన మొత్తం రైతులు 59 లక్షల మంది. అయితే ఇటీవల పీఎం కిసాన్ కింద ప్రధాని మోడీ విడుదల చేసిన రూ. 2 వేలు 15 లక్షల 20వేల మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఇలా ఒక్క సారి కాదు.. ప్రతి విడతలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ేపీకి రూ.9603 కోట్లు కేటాయించింది. కానీ ఇందులో రూ.1343 కోట్లు మిగిలిపోయాయి. రైతులకు జమ కావడం లేదు. ఈ సమస్య ప్రతీసారి వస్తోంది. కానీ ఈ సారి అనూహ్యంగా 25 శాతం వరకూ రైతులకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడకపోవడమే ఆశ్చర్యకరంగా మారింది.
రైతులు పీఎం కిసాన్ సొమ్ము బ్యాంక్ అకౌంట్లలో పడాలంటే కొన్ని సాంకేతికపరమైన అంశాలను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కు అధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని వారికి చెల్లింపులు ఆగిపోతున్నాయి. కేంద్రం ప్రధానంగా ఆధార్ చెల్లింపుల ద్వారా నగదు బదిలీ చేస్తోంది. ఆధార్ లింక్ లేకపోవడం వల్ల నగదు జమ కావడం లేదు. ఆధార్ చెల్లింపు వ్యవస్థ లోపాలతో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ సమస్యల కారణంగా కూడా రైతులు నష్టపోతున్నారు.
అయితే రైతులకు ఎందుకు చెల్లింపులు నిలిపివేస్తున్నారో స్పష్టమైన కారణాలను పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో చెప్పట్లేదు. సమస్య ఏమిటో తెలిస్తే వారు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. పైగా తమ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌న లింక్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న రైతులను బ్యాంక్ సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో గతంలో బ్యాంక్ అకౌంట్లో పీఎం కిసాన్ సొమ్ము జమ అయి.. ఇప్పుడు ఎందుకు జమ కాలేదన్నది మరో కీలకమైన ప్రశ్న. అప్పట్లో ఆధార్ అనుసంధానం అయితే.. ఇప్పుడెందుకు ఆపేశారన్నది రైతుల సందేహం. వీటిని తీర్చేవారు ఎవరూ లేరు. రైతులు మాత్రం నష్టపోతున్నారు. వారికి ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి.