Alluri Sitarama Raju District News: అల్లూరి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇంట్లో చిన్నారి ప్రాణాలు కోల్పోతే ఆ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు రెండు రోజులు వేచి చూడాల్సిన దుస్థితి. గత కొద్ది రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్మశానం వెల్లడం కష్టమే అయినప్పటికీ ఈ కష్టాలు ఇప్పట్లో తీరదని చివరికి సాహసం చేసి ఆ మృతదేహాన్ని తరలించారు. కొండంత కష్టంలో కన్నీటితో ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.
గిరిజన గ్రామంలో పదేళ్ల బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. ఊరికి, స్మశానానికి మధ్యలో వాగు ఉంది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండంతో మృతదేహాన్ని స్మశానానికి తరలించే మార్గం లేకపోయింది. దీంతో డెడ్ బాడీని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే వరద ఉధృతి ఎంతకీ తగ్గకపోవడంతో మృతదేహంతో వాగును దాటి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ తుమ్ముడిపుట్టుకి చెందిన బురిడి భాను (10) మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలు చేయడానికి గ్రామానికి దూరంగా వాగు అవతల శ్మశానం ఉంది. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఊర పక్కనే ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దానిని దాటి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేక మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని జాగారం చేశారు.
గంటలు రోజులయ్యాయి. వరద మాత్రం తగ్గలేదు. దీంతో ఇక సాహసం చేయక తప్పలేదు. మూడు రోజులు గడుస్తున్నా వరద తగ్గకపోవడంతో బుధవారం గ్రామస్తులు ప్రాణాలకు తెగించి మృతదేహాన్ని వాగు దాటించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గిరిజనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారడం లేదన్నారు. ఆస్పత్రికి వెళ్లాలన్నా, ఎవరైనా చనిపోతే శ్మశానానికి వెళ్లాలన్నా వాగులు దాటాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు వసతి కల్పించాలన్నారు.
ప్రభుత్వాలు మారుతున్నా అడవి బిడ్డలకు మాత్రం కనీస సౌకర్యాలు ఆమడ దూరంలోనే ఉన్నాయి. చంద్రుడిపై అడుగుపెట్టే స్థాయికి దేశం చేరుకున్నా అడవిని నమ్ముకున్న అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గిరిజనులకు కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగం వచ్చిన కష్టం వచ్చినా తండాల నుంచి డోలి కష్టాలు తప్పడం లేదు. రాళ్లు కొండలు లోయలపై నుంచి డోలి కట్టి తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు లేకున్నా వాగులు దాటుకుంటూ ఎలాగోలా ఒకరి కష్టాన్ని నలుగురు పంచుకొని ఒకరికి ఒకరు సాయం చేసుకుని తరలిస్తారు.
వర్షం పడితే ఆ గిరిజనుల కష్టాలు వర్ణనాతీతం. వాగులు పొంగుతుంటాయి. గడ్డలు ఉదృతంగా ప్రవహిస్తుంటాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఏ ఇంటిలోనైనా కష్టం వచ్చి పడితే.. ఇక ఆ బాధ, వ్యధ వర్ణించలేనిది. ఆసుపత్రికి తరలించాలన్న కష్టమే. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్న సాహసం చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో వాగులో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా తమ కష్టాలను గుర్తించి వంతెన సదుపాయం కల్పించాలని గిరిజనులు విన్నవిస్తున్నారు.