No Work From Home: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధ సమావేశ మందిరంలో జిల్లా కమిషనర్లు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వాహణాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా, తాలూకా కేంద్రాల్లోని ప్రభుత్వ అధికారులు అందరూ ఇంటి నుంచి పని చేయకుండా వారి సంబంధిత కార్యాలయాల నుంచి పని చేయడాన్ని ముఖ్యమంత్రి తప్పనిసరి చేశారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు.


అలాగే ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో ఉంటూ సాధారణ ప్రజలకు కూడా స్పందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా సాధారణ ప్రజలు కోరిన తగిన విధంగా స్పందించాలని నిర్దేశించారు. అధికారులు ఫోన్ కాల్ లకు స్పందించడం లేదని ప్రజలు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.ముఖ్యమంత్రి కార్యాలయమైనా, మంత్రి, ఎమ్మెల్యే ఆఫీసు నుంచి అయినా లేదా సాధారణ ప్రజల నుంచైనా ఫోన్ కాల్స్ వస్తే స్పందించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.


ప్రైవేట్ రుణదాతలు, బ్యాంకులు రైతులను వేధిస్తే సహించేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కనీసం 251 రైతు ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 174 పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన కేసులను వెంటనే పరిష్కరించి పరిహారం పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.


రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. తహసీల్దార్, సబ్ డివిజనల్ అధికారి, జిల్లా కమిషనర్ల కోర్టులకు వచ్చే దరఖాస్తులు ఐదు సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఐదేళ్లు దాటినా కేసు పరిష్కారం కాలేదంటే సరైన చర్యలు తీసుకోవడం లేదని అర్థమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.


న్యాయం ఆలస్యంగా జరిగితే అది జరగనట్లే అనే సూక్తిని ముఖ్యమంత్రి అధికారులు గుర్తు చేశారు. ఎంత ఆలస్యం చేస్తే అవినీతికి అంత ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. జాప్యం కూడా ఒక రకమైన అవినీతేనని సిద్ధరామయ్య అన్నారు. తహసీల్దార్ ఏదైనా దరఖాస్తును మూడు నెలల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. సబ్ డివిజనల్ అధికారులకు వచ్చే అప్పీళ్ల పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతోందని చెప్పారు. దీనిని గరిష్ఠంగా 6 నెలల్లో పరిష్కరించాలని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలని సూచించారు. 


'నేను ముఖ్యమంత్రిని అయ్యాక చాలా జిల్లాల్లో పర్యటించాను. సామాన్యులు వందల సంఖ్యలో వినతులు ఇస్తున్నారు. జిల్లా, తాలూకా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలతో ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. మీరు బహిరంగ సభలు నిర్వహించి ఉంటే ఇలా జరిగేది కాదు. తక్షణమే వాటికి పరిష్కారాలు అందించండి' అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.


వైద్యులు అందుబాటులో లేకపోవడం, అర్హత కలిగిన వైద్యులకు బదులు పారా మెడికల్ సిబ్బంది మందులు రాసే విధానంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు తమ తమ కేంద్రాల్లోనే ఉంటూ ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలను సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు తమ ప్రధాన కార్యాలయంలో ఉండి ప్రజల సమస్యలపై స్పందించాలని కర్ణాటక సీఎం నిర్దేశించారు.