Kota Suicides: 


విద్యార్థిని ఆత్మహత్య


రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ బలవన్మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో విద్యార్థి ప్రాణాలు తీసుకుంది. NEET ఎంట్రెన్స్ టెస్ట్‌కి ప్రిపేర్ అవుతున్న 16 ఏళ్ల విద్యార్థిని తన గదిలోనే ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఏడాదిలో కేవలం 8 నెలల్లోనే 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాంచీకి చెందిన విద్యార్థిని కోటాలోని ఓ హోటల్‌లో ఉంటూ చదువుకుంటోంది. NEET ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఆమె ఉన్నట్టుండి ఉరి వేసుకుని చనిపోయింది. కారణాలేంటన్నది ప్రస్తుతానికి తెలియలేదు. కోటాలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఏటా చదువుకోడానికి వస్తుంటారు. JEE,NEET లాంటి పరీక్షల కోసం ఇక్కడే ఉంటూ కోచింగ్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఏడాది అత్యధికంగా 25 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. రాజస్థాన్ పోలీసుల డేటా ప్రకారం...2018లో 18 మంది, 2016లో 17, 2017లో 7, 2018లో 20, 2019లో 18 మంది 2022 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య 25కి చేరుకుంది. 2020,21లో మాత్రం ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదు. 


ఫ్యాన్‌లకు స్ప్రింగ్‌లు 


కోటా ట్రైనింగ్ సెంటర్స్‌కి హబ్‌ లాంటిది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడి హాస్టల్స్‌, పీజీల్లో ఉంటూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా ప్రిపేర్ అయ్యే క్రమంలోనే కొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంజనీర్లు,డాక్టర్లు అవ్వాలన్న కలలతో వచ్చిన వాళ్లు చివరికి ఆత్మహత్యకు పాల్పడి అర్ధంతరంగా జీవితాన్ని ముగించేస్తున్నారు. ఫెయిల్ అవుతామేమో అన్న భయం కొందరిది. సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయానన్న బెంగ మరి కొందరిది. కారణమేదైనా ఈ మధ్య కాలంలో కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. గత 8 నెలల్లో 22 మంది ప్రాణాలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగారు. హాస్టల్స్‌లో చాలా మంది ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోతున్నారని గమనించారు. అందుకే...పాత ఫ్యాన్‌లు తీసేసి స్ప్రింగ్‌ లోడెడ్ ఫ్యాన్స్‌ని ఫిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ ఫ్యాన్‌కి ఉరి వేసుకోవాలని చూసినా వెంటనే స్ప్రింగ్‌తో సహా కిందకు వస్తుందే తప్ప ఉరి బిగుసుకోదు. అందుకే...ఇక్కడి పీజీలు, హాస్టల్స్‌లో ఈ మెకానిజంతోనే ఫ్యాన్‌లు ఫిట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలిచ్చారు. మానసికంగా విద్యార్థులకు ధైర్యం చెప్పడం హాస్టల్స్ విధి అని, వారి భద్రతపైనా బాధ్యత ఉంటుందని తేల్చి చెప్పారు. ఒకవేళ ఈ ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే...ఆయా హాస్టల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.