తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల విషయంలో వివిధ రాజకీయ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అరెస్టు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు.


మినీ జమిలికి ఛాన్స్
‘‘ఏ పరిస్థితుల్లోనూ 29 రాష్ట్రాలతో కలిపి జమిలి ఎన్నికలు జరగవు. మినీ జమిలి ఎన్నికలకు మాత్రం ఆస్కారం ఉంది. 15 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీ రద్దు చేయండి. అప్పుడు మొత్తం 19 రాష్ట్రాలు, లోక్‌సభ కలిపి ఎన్నికలు జరపవచ్చు. ఇదే విషయంపై నేను ప్రధాని కార్యాలయంలో లెటర్ ఇచ్చాను. హోంశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో కూడా లేఖలు ఇస్తాను. ప్రధాని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యే 3 నెలల లోపు ఎప్పుడైనా ఎన్నికలు పెట్టొచ్చు. అంతే తప్ప ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని పొడిగించే అవకాశం లేదు. జనవరి 15న గం. 12.00కు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే గం. 11.59 నిమిషాల్లోపు కొత్త ప్రభుత్వం కొలువుతీరాలి.


ఒక గంట పొడిగించాలన్నా సరే రాజ్యాంగ సవరణ చేయాలి. 1971లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టి పార్లమెంట్, అసెంబ్లీల పరిధి ఆరేళ్లకు పెంచింది. ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గడువు పెంచింది. రాజ్యాంగ సవరణ చేయాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాలి. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎన్నికలు రెండు నెలలు ముందూ, వెనుకా ఎప్పుడైనా జరగొచ్చు అని కొందరు నేతలు అంటున్నారు. ప్రజలను తప్పుదోవపట్టించవద్దు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి’’ అని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు చెప్పారు.


చంద్రబాబుకు హౌజ్ రిమాండ్ ఇవ్వకపోతే ప్రాణాలకే ప్రమాదం
నిన్న చంద్రబాబు హౌజ్ రిమాండ్ గురించి మాట్లాడుతూ.. చరిత్రలో హౌజ్ రిమాండ్ ఇచ్చిన ఉదంతాలు లేవు అని నిన్న చెప్పాను. 2021లో మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురి విషయంలో హౌజ్ రిమాండ్ ఇచ్చారు. ఈ నలుగురికి తప్ప మరెవరికీ ఇచ్చినట్టు చరిత్రలో లేదు. ఈ ఉదాహారణలు కోర్టులో వెల్లడిస్తే చంద్రబాబుకు కూడా హౌజ్ రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ ఖైదీలకు ప్రత్యేక సెల్, ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి. బయటి నుంచి కూరగాయలు తెప్పించుకోవచ్చు. వంట చేసుకోవచ్చు. నేను కూడా రాజకీయ ఖైదీగా నేను, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు చాలా మంది ఉన్నాం. జైలర్లు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తారు. కాబట్టి కోర్టు చెప్పిన సదుపాయాలు జైలులో కల్పించలేదని నిన్న భువనేశ్వరి చెప్పారు.


కోర్టుకు చెవులే ఉంటాయి. కళ్లు ఉండవు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహానికి అవకాశం ఉంది. బయట నుంచి ఆహారం తీసుకెళ్లినా సరే.. మార్గ మధ్యలో అందులో విషం కలిపే అవకాశం ఉంది. మహారాష్ట్ర, బెంగాల్ తరహాలో చంద్రబాబుకు హౌజ్ రిమాండ్‌కు అవకాశం ఇవ్వండి. జగన్ దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వేలు చూసిన జగన్ కచ్చితంగా ఓడిపోతారని చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి 88 కంటే ఎక్కువ సీట్లు ఖాయం. పవన్ కళ్యాణ్ కలిస్తే 130 సీట్లు వస్తాయి. బాబు అరెస్టుతో తమ పని అయిపోయిందని వైఎస్సార్సీపీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఓడిపోతే సభకు వెళ్లరు. చంద్రబాబును అరెస్టు చేయడం తెలుగు ప్రజలకు చీకటి రోజు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో అసలు ఏమీ లేదు. జగన్ మీద ఉన్న కేసులు అలా కాదు. ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలియదా? 


నేను కూడా వారికి ఆర్థిక సహాయం చేశాను. తేదీలతో సహా నేను చెప్పగలను. ఆయనకు ఈ వేల కోట్లు ఎక్కణ్ణుంచి వచ్చాయి? ఇప్పటికైనా జగన్ మారాలి. లేదంటే నీ వెంట ఉన్నవాళ్లంతా చెట్లు, పుట్టలు పట్టుకుని వెళ్లిపోవడం ఖాయం. కనుచూపు మేరల్లో ఉండరు. దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది. నీ చర్యల కారణంగా నీ వెంట ఉన్నవాళ్లు నష్టపోతారు.


రేవంత్ వల్లే కాంగ్రెస్ పార్టీ మటాష్
టీపీసీసీ గురించి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీని ఆయన వ్యక్తిగత పార్టీగా మార్చారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆమెను చేరకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకు తగిన మూల్యం రేవంత్ చెల్లించుకోక తప్పదు. తెలంగాణపై తుమ్మల నాగేశ్వర రావు స్టాండ్ ఏంటి? మరి ఆయన్ను ఎలా పార్టీలోకి తెస్తున్నారు? మండవ, సీతా దయాకర్ రెడ్డి స్టాండ్ ఏంటి? వారిని ఎలా పార్టీలోకి తెస్తున్నారు? సమైక్యవాదం వినిపించిన సీపీఐ(ఎం)ను ఎందుకు దగ్గర తీసుకుంటున్నారు’’ అని ప్రశ్నించారు.