Dunith Wellalage : రెండ్రోజుల క్రితం ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న బౌలింగ్ దళమైన షహీన్ షా అఫ్రిది,  నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లను ఎదుర్కున్న భారత బ్యాటర్లు  పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్‌లు అర్థ సెంచరీలు చేయగా  కోహ్లీ, రాహుల్‌లు సెంచరీలతో కదం తొక్కారు.  పాకిస్తాన్‌ బౌలర్లనే ఇంత బాదిన భారత బ్యాటర్లు ఇక  లంక  బౌలింగ్‌ను చీల్చి చెండాడుతారని అంతా భావించారు.  కానీ ఆ పప్పులేమీ ఉడకలేదు.  ఓ 20 ఏళ్ల కుర్రాడు.. భారత టాపార్డర్‌ను కకావికలం చేశాడు.  


లంకతో మ్యాచ్‌లో 11 ఓవర్లకు భారత స్కోరు  80-0. కానీ  వెల్లలాగె వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.  12వ ఓవర్లో అతడు వేసిన తొలి బంతికే గిల్ క్లీన్ బౌల్డ్.  14వ ఓవర్లో  ఐదో బంతికి  విరాట్ కోహ్లీ ఖేల్ ఖతం.  16వ ఓవర్లో  రోహిత్ కూడా బౌల్డ్. 11 ఓవర్లలో 80-0గా ఉన్న భారత్.. 16 ఓవర్ వచ్చేసరికి 91-3గా మారింది.  లంక  జట్టు కూడా ఊహించని విధంగా భారత  బ్యాటింగ్ లైనప్ వెన్ను విరిచాడు  దునిత్ వెల్లలాగె. తర్వాత కూడా భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్న కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలనూ  ఔట్ చేసి ఫైఫర్ సాధించాడు. ఇంతకీ ఎవరీ కుర్రాడు..? 


ఎవరీ వెల్లలాగె..? 


కొలంబోకే చెందిన వెల్లలాగె  2003లో జన్మించాడు. అతడి వయసు  20 ఏండ్లు.  స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయిన అతడు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థుడు. గతేడాది  ఐసీసీ నిర్వహించిన అండర్ - 19 క్రికెట్ వరల్డ్ కప్  లో శ్రీలంక జట్టుకు అతడే సారథిగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో భాగంగా లంక  ఆడిన తొలి మ్యాచ్‌ (ఆసీస్)లోనే ఐదు వికెట్లు తీశాడు.   తర్వాత మ్యాచ్‌లోనూ అదే రిపీట్ చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన  మ్యాచ్‌లో  బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా చెలరేగాడు.  ఆ మ్యాచ్‌లో 130 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా తీశాడు. 






అండర్ - 19 వరల్డ్ కప్‌లో రాణించిన వెల్లలాగెకు  గతేడాది శ్రీలంక జాతీయ జట్టులో చోటు దక్కింది.  ఆస్ట్రేలియాతో ఆ జట్టు ఆడిన  వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన అతడు.. దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. అదే ఏడాది అతడు శ్రీలంక - ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా  ఎంపికై ఓ టెస్టు కూడా ఆడాడు.  


లంక దిగ్గజ స్పిన్నర్ రంగనా హెరాత్ బౌలింగ్ శైలిని పోలి ఉండే వెల్లలాగె.. ఇప్పటివరకూ 12 వన్డేలు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. భావి సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న వెల్లలాగె.. బౌలింగ్‌తో పాటు    లోయరార్డర్ బ్యాటర్‌గా కూడా సేవలందిస్తున్నాడు.  నిన్న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక తరఫున అతడే టాప్ స్కోరర్. ఒకవైపు కుల్‌దీప్,  జడేజా వంటి స్పిన్నర్లను మరో వైపు బుమ్రా, సిరాజ్ వంటి పేసర్లను కూడా వెల్లలాగె  సమర్థంగా ఎదుర్కున్నాడు.   ధనంజయ డిసిల్వతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన అతడు..  లంక విజయంపై ఆశలు కల్పించాడు. 


- భారత్‌పై  ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో వెల్లలాగె  లంక తరఫున  ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.  గతంలో ఈ రికార్డు చరిత బుద్దిక  పేరిట ఉండేది.  బుద్దిక 2001లో  జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో ఫైఫర్ తీశాడు. అప్పుడతడి వయసు 21 ఏళ్ల 65 రోజులు.  తాజాగా వెల్లలాగె 20 ఏళ్ల  264 రోజుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. మొత్తంగా వన్డే క్రికెట్ చరిత్రలో  ఐదు వికెట్లు తీసిన పిన్న వయస్కుడు అఫ్గానిస్తాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్. ముజీబ్.. 16 ఏళ్ల 325 రోజుల్లోనే ఈ ఘనతను సాధించాడు. 













ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial