Union Cabinet: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే పలు కీలక నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్న దృష్ట్యా పలు వరాలు కూడా ప్రకటించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లకు మద్దతు గ్రాంట్ ను విడుదల చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, మొత్తం 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లకు మూడేళ్లలో రూ.1,650 కోట్లను విడుదలను ఆమోదించింది.






ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన మంతత్రి ఉజ్వల్ యోజన పథకం కింద 9.60 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తుండటం సంతోషంగా ఉందని మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ నిర్ణయం వల్ల మరింత మంది పేదలు, అవసరమైన మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 


రూ.7,210 కోట్ల ఆర్థిక వ్యయంతో నాలుగేళ్లలో అమలు ఈ-కోర్టుల ప్రాజెక్టు ఫేజ్-III ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.






ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకతాటిపైకి చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటును రద్దు చేసినా చేయవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Also Read: RBI Loan Settlement: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌! ఈ తప్పు చేస్తే బ్యాంకులు రోజుకు రూ.5000 పరిహారం ఇవ్వాల్సిందే!