RBI Loan Settlement: 


ఆస్తి పత్రాలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న కస్టమర్లకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) శుభవార్త చెప్పింది. అప్పు తీర్చిన నెల రోజుల్లోనే స్థిర, చరాస్తుల పత్రాలు తిరిగిచ్చేయాలని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, అసెట్‌ రీకన్స్‌ట్రక్షన్‌ కంపెనీలకు తెలిపింది. ఒకవేళ ఆలస్యమైతే రోజుకు రూ.5000 చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. అలాగే రిజస్టర్‌ చేసి అభియోగాలు తొలగించాలని తెలిపింది.


రెగ్యులేటెడ్‌  ఎంటిటీస్‌ (REs) న్యాయంగా వ్యవహరించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు ఈ ఆదేశాలు జారీ చేసింది. రుణ గ్రహీత తనకు నచ్చిన చోట స్థిర/చరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకింగ్‌ ఔట్‌లెట్‌, బ్యాంకు శాఖ, రుణం తీసుకున్న ఏదైనా ఆఫీస్‌లో పత్రాలు తిరిగి  తీసుకోవచ్చని తెలిపింది.


స్థిర, చరాస్తి పత్రాలు కాల పరిమితి, తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి వివరాలు రుణం ఆమోదించిన ప్రత్రాల్లో పేర్కొనాలని ఆర్బీఐ సూచించింది. ఒకవేళ ఏకైక రుణగ్రహీత లేదా జాయింట్‌ రుణ గ్రహీతల్లో ఎవరైనా మరణిస్తే ఏం చేయాలో కేంద్ర బ్యాంకు తెలిపింది. రుణ గ్రహీతల వారసులకు అసలైన ఆస్తి పత్రాలు తిరిగిచ్చేందుకు సరైన ప్రక్రియను ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ ప్రక్రియను బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని తెలిపింది. అలాగే సంబంధిత విధానాలను వినియోగదారుల సమాచారంలో ఉంచాలని పేర్కొంది.


అప్పు తీర్చినప్పటికీ ఆస్తి పత్రాలు తిరిగివ్వడం, సంతృప్తి చెందినట్టు ధ్రువపత్రం జారీ చేయడంలో 30 రోజులకు మించి జాప్యం జరిగే సూచనలు ఉంటే ఆలస్యానికి కారణాలను సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు, బ్యాంకింగేతర సంస్థ వద్దే ఆలస్యం జరిగితే రోజుకు రూ.5000 రుణ గ్రహీతలకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ స్థిరచరాస్తి పత్రాలు చిరిగినా, కనిపించకుండా పోయినా నకలు / ధ్రువీకరణ పత్రాలను తిరిగి పొందేందుకు రిజిస్టర్‌ ఎంటిటీస్‌ సాయం చేయాలి. అందుకు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మరో 30 రోజులు బ్యాంకులకు ఆర్బీఐ గడువు కల్పించింది. చట్టంతో సంబంధం లేకుండా రుణ గ్రహీతలకు రూ.5000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.