టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన్ని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఒకవైపు అభిమానులు ధర్నాలు, రాస్తారోకోలు బందులు చేపట్టారు. బాబు అరెస్టును టీడీపీ నేతలు మాత్రమే కాకుండా రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఖండిస్తున్నారు. నిన్నటి వరకు మాట్లాడని సినీ ప్రముఖులు ఇప్పుడు ఒక్కొక్కరుగా చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తున్నారు.


ఇప్పటికే సీనియర్ నిర్మాత అశ్వినిదత్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ మద్దతును తెలిపారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూ.. బాబు ఈ బ్లాక్ మార్క్ ను దాటుకుని బయటికి రావాలని' ట్వీట్ చేశారు. ఈ మేరకు రాఘవేంద్రరావు తన ట్వీట్లో పేర్కొంటూ.. "శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలతో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఎలాగైతే బతికి బయటపడ్డారో, ఇప్పుడు కూడా ఆ స్వామివారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండా బయటకు వస్తారు" అని పేర్కొన్నారు. దీంతో దర్శకేంద్రుడు చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.






కాగా చంద్రబాబు హయాంలో రాఘవేంద్రరావు ఎన్నో సినిమాలు తీశారు. మొదటి నుంచి చంద్రబాబుతో రాఘవేంద్రరావు గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా ఆయన హయాంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు రాఘవేంద్రరావు గారు చైర్మన్ గా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. మరోవైపు సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన రోజు రాఘవేంద్రరావు మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి" అని రాస్కొచ్చారు.






ఇక ఇప్పుడు మరోసారి ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా రావాలని రాఘవేంద్ర కోరుకోవడం విశేషం. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ హైదరాబాదులోని ఐటీ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ మేరకు హైదరాబాదులోని విప్రో సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు.' ఐ యామ్ విత్ సీబీఎన్'(I Am With CBN) ప్లకార్డులతో ఉద్యోగులు ధర్నా చేపట్టారు.


వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. 'సైకో పోవాలి - సైకిల్ రావాలి' అంటూ నినాదాలు సైతం చేశారు. చంద్రబాబుని రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా చంద్రబాబుపై అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోని.. ఆయన్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో విప్రో జంక్షన్​లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదంటూ ఉద్యోగులను వెనక్కి పంపే ప్రయత్నం చేశారు.


Also Read : సీబీఎన్ అరెస్ట్‌పై తారక్ స్పందనేది? టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే: రామ్ గోపాల్ వర్మ



Join Us on Telegram: https://t.me/abpdesamofficial